‘పథకాల అమలులో వేగం పెంచండి’ | - | Sakshi
Sakshi News home page

‘పథకాల అమలులో వేగం పెంచండి’

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

ప్రశాంతి నిలయం: ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలులో ప్రభుత్వ పథకాలు, పరిపాలనా అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ, గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా తదితర వాటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో జనగణన కోసం ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్ల శిక్షణను ఏప్రిల్‌ 25వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్‌ 16 నుంచి సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రారంభమైందన్నారు. ఉపాధి హామీ కూలీల హాజరు జిల్లా సగటు 47.23 శాతం ఉందని, పథకం లక్ష్యాలను చేరుకునేందుకు కూలీల సంఖ్య పెంచాలన్నారు. ఆవాస్‌ యోజన కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. సోలార్‌ విద్యుత్‌ పథకం కింద రిజిస్ట్రేషన్లు పెంచాలన్నారు. వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి పాల్గొన్నారు.

అనవసర సిజేరియన్లను తగ్గించాలి

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు అనవసర సిజేరియన్లు తగ్గించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో సీ–సెక్షన్‌ ప్రసవాలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... 2022–23లో సీ–సెక్షన్‌ ప్రసవాలు 48.42 శాతంగా నమోదు కాగా, 2025–26 నాటికి అవి 52.67 శాతానికి పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరిగాయన్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన రేటుకు 10–15 శాతం అధికమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప సీ–సెక్షన్లు చేయరాదన్నారు. సీ– సెక్షన్‌ చేయాల్సి వస్తే సీనియర్‌ వైద్యుల సలహా తీసుకోవాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సాధారణ ప్రసవాలపై అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం, డీసీహెచ్‌ఎస్‌ మధుసూదన్‌, జిల్లా సమన్వయకర్త శ్రీదేవి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భాగ్యలక్ష్మి, డాక్టర్‌ నాగేంద్ర నాయక్‌, డాక్టర్‌ సునీల్‌, పద్మజ తదితరులు ఉన్నారు.

వర్షపునీటిని ఒడిసి పడదాం

ధర్మవరం రూరల్‌: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టం పెంచుదామని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం చెరువు వద్ద నిర్వహించిన జలధార–జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలమట్టం పెంచడమే ‘జలధార–జలహారతి’ ముఖ్య ఉద్దేశమన్నారు. ధర్మవరం చెరువును గ్రీన్‌ కవర్‌ ప్రోగ్రాం కింద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి నిపుణుల బృందంతో సర్వే చేయించి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంచడంలో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలన్నారు. పట్టణ పరిశుభ్రతలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. కలెక్టర్‌ వెంట ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య, ఇరిగేషన్‌ ఈఈ సురేంద్రనాథ్‌ రెడ్డి, తహసీల్దార్‌ సురేష్‌బాబు, సాగునీటి సంఘం అధ్యక్షుడు రేనాటి శ్రీనివాసులు, నాయకులు కమతం కాటమయ్య తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement