● ప్రజా సమస్యలపై
రాజీలేని పోరాటం చేద్దాం
● నాయకులు, కార్యకర్తలకు
ఉష శ్రీ చరణ్ పిలుపు
పెనుకొండ రూరల్: ‘‘చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను అష్టకష్టాలు పెడుతోంది. ఊరారా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. కూటమి పార్టీల నేతలు సహజ వనరులను దోచుకుంటూ అదే పాలన అనుకుంటున్నారు. వారి ఆగడాలను ఎక్కడికక్కడ ఎండగడదాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం మండలాల్లోని పంచాయతీ కన్వీనర్లు, యువజన విభాగం, ఐటీ విభాగం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అందజేసిన గుర్తింపు కార్డులను పరిశీలించారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... అనుబంధ విభాగాల సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అధికార పక్షం తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అనుబంధ విభాగాలన్నీ పని చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పెనుకొండ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు మధుమతి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్‌రెడ్డి, గజేంద్ర, శ్రీనివాసులు, పగడాల వెంకటేష్, మేదర శంకర, తిమ్మయ్య, ఆయా మండలాల మాజీ కన్వీనర్లు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.


