ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం | - | Sakshi
Sakshi News home page

ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

పరిగి: అధికార పార్టీ నేతల ఆగడాలకు బలి కాకుండా ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటామని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌ అన్నారు. శుక్రవారం ఆమె... పరిగిలోని బీరలింగేశ్వర ఆలయ కల్యాణ మంటపంలో వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులతో మాట్లాడి సలహాలు, సూచనలు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కష్టపడిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామన్నారు. జగనన్న 2.0 నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంటుందని, అధికారంలోకి వచ్చాక... ప్రతి కార్యకర్తకూ న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ దుర్మార్గ పాలన సాగిస్తోందన్నారు. వారి ఆగడాలు, అఘాయిత్యాలు పెచ్చుమీరడంతో ప్రజల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పైగా కూటమి నేతల అన్యాయాల గురించి ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అయినా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలెవరూ జంకడం లేదన్నారు. జగనన్న కోసం ఎన్ని కేసులైనా భరిస్తామంటున్న వారి ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు.

ఐడీ కార్డుతో గుర్తింపు..

ఐడీ కార్డులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఉషశ్రీచరణ్‌ అన్నారు. ఇప్పటికే వివరాలన్నీ సమర్పించి ఐడీ కార్డు పొందిన వారిని ఆమె అభినందించారు. ఐడీ కార్డులో ఏవైనా లోటుపాట్లు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎడిట్‌ ఆప్షన్‌లో ఫోన్‌ నంబరు, అడ్రస్‌ తదితర వాటిని మార్చుకునేందుకు అవకాశముందన్నారు. దరఖాస్తులు సమర్పించి ఇప్పటి వరకూ ఐడీ కార్డులు పొందని వారికి ప్రత్యేక యాప్‌ ద్వారా అప్డేట్‌ చేసుకునే వెసులుబాటు అధిష్టానం కల్పించినట్లు ఉషశ్రీచరణ్‌ వెల్లడించారు.

ప్రజలతో మమేకం కావాలి..

కూటమి ప్రభుత్వం అవలంబిస్త్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో జనమంతా అష్టకష్టాలు పడుతున్నారని, ఒక్క సంక్షేమం పథకం కూడా అందక అల్లాడిపోతున్నారన్నారు. అందువల్లే ఇప్పుడు అందరూ వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారన్నారు. ఎప్పుడెప్పుడు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న ఆకాంక్ష వారిలో కనిపిస్తోందన్నారు. అందువల్ల వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి వైఫల్యాలను ఎండగడుతూనే ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం పోర్టల్‌లో నమోదు అంశంపై డెమో నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, సీనియర్‌ నాయకుడు ప్రభాకర్‌, గ్రామ పంచాయతీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగనన్న 2.0 నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంటుంది

క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ

జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

Advertisement
 
Advertisement
Advertisement