పెనుకొండ: చంద్రబాబు ప్రభుత్వంలో సహజ వనరులను కొల్లగొట్టడమే జీవనాధారంగా మార్చుకున్న ‘పచ్చ నేతలు’ అక్రమార్జనకు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాతో నదులు, చెరువుల రూపురేఖలు మార్చేసిన అక్రమార్కులు చివరకు మట్టినీ మనీగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. చెరువుల్లోని మట్టిని తవ్వుకుని తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. దీంతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలన్నీ రుపురేఖలు కోల్పోయి లోయల్లా కనిపిస్తున్నాయి. ఇక కొండ గుట్టల పరిస్థితి సైతం దారుణంగా తయారైంది.
ఊరూరా అక్రమ దందా..
‘పచ్చ’ మట్టి మాఫియా నియోజకవర్గంలోని ఊరూరా రెచ్చిపోతోంది. కొండలను పిండేసి, చెరువులను చెర బట్టి భారీగా ఆర్జిస్తోంది. ఈ క్రమంలోనే పెనుకొండ మండలంలోని తిరంగరాయల చెరువు, గొందిపల్లి చెరువు, కురుబవాండ్లపల్లి చెరువు, తాజాగా మరువపల్లి చెరువు, సోమందేపల్లి మండలంలో సోమందేపల్లి చెరువు, దానికి ఆనుకుని ఉన్న కొండ గుట్టలు, నడింపల్లి తదితర ప్రాంతాల్లోని చెరువుల నుంచి పెద్ద ఎత్తున మట్టి దందా సాగుతోంది. ఫలితంగా చెరువులన్నీ లోయల్లా మారాయి. ఈ దందా అంతా మంత్రి కనుసన్నల్లోనే సాగుతుండటంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పట్టపగలు పోలీసుస్టేషన్‌ల ముందునుంచే మట్టి వాహనాలు వెళ్తున్నా ఎవరూ వాటిని నిలిపే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఫలితంగా చెరువులు ధ్వంసమయ్యాయి. కొండలన్నీ నామరూపాల్లేకుండా పోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి పచ్చ మాఫియాను కట్టడి చేసి మట్టి దందాను అరికట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
కొండలు పిండి...
చెరువులను చెరబట్టి
పెనుకొండలో రెచ్చిపోతున్న
‘పచ్చ మాఫియా’
మట్టి తవ్వకాలతో
అక్రమార్జన
భారీ గుంతలతో లోయలను
తలపిస్తున్న చెరువులు


