పాసు పుస్తకాల జారీ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాసు పుస్తకాల జారీ వేగవంతం చేయాలి

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

రెవెన్యూ అధికారులకు

జేసీ మౌర్య భరద్వాజ్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: రీ సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి జిల్లాలోని రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.... 2027 మార్చి నాటికి జిల్లాలో రీ సర్వే పూర్తి చేసి రైతులందరికీ కచ్చితమైన కొలతలు నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. రానున్న మే నెలలో 17 గ్రామాల్లో, జూన్‌ నెలలో మరో 12 గ్రామాల్లో పాసుపుస్తకాల పంపిణీకి షెడ్యూల్‌ సిద్ధం చేయాలన్నారు. పాసు పుస్తకాల్లో ఎలాంటి తప్పులు ఉండకూడదన్నారు. తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫేజ్‌–2, ఫేజ్‌–4, ఫేజ్‌–5 రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు, సబ్‌ డివిజన్లను జూన్‌ నాటికి పూర్తి చేయాలన్నారు. తిరస్కరించిన కేసుల్లో స్పష్టమైన కారణాలను తెలియజేస్తూ నోటీసులు జారీ చేయాలన్నారు. 32 పైలెట్‌ గ్రామాలకు సంబంధించి వెబ్‌ల్యాండ్‌ 2.0 పోర్టింగ్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో డీఆర్‌ఓ విజయసారథి, సర్వే శాఖ ఏడీ విజయశాంతి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ఎలుగుబంటి దాడి..

రైతుకు గాయాలు

రొద్దం: పొలం వద్ద గొర్రెలను మేపుతున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటన శుక్రవారం రొద్దం మండల పరిధిలోని పెద్దకోడిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన పోతన్న కుమారుడు బోయ నరసింహులు శుక్రవారం గొర్రెలను మేపడానికి గ్రామ పెద్దచెరువు సమీపంలో ఉన్న పొలం వద్ద వెళ్లాడు. సమీపంలోని మొక్కజొన్న చేనులో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరసింహులుపై దాడి చేసింది. ఆ సమయంలో అతని చేతిలో కర్ర ఉండడంతో ఎలుగుబంటిని బాదుతూ గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. అయితే అప్పటికే గాయపడిన నరసింహులును కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.

జెడ్పీ సీఈఓగా విజయలక్ష్మి

అనంతపురం టవర్‌క్లాక్‌: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్‌ సీఈఓగా పి.విజయలక్ష్మి నియమితులయ్యారు. గుంతకల్లు డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిచేస్తున్న ఆమెను జెడ్పీ రెగ్యులర్‌ సీఈఓగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమె గతంలో డ్వామా ఏపీడీగా పనిచేస్తూ ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీగా పని చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement