ప్రశాంతి నిలయం: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజనీరింగ్, ఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ‘పాలిసెట్’కు పకడ్బందీ ఏర్పాటు చేయాలని డీఆర్‌ఓ విజయసారథి ఆదేశించారు. శుక్రవారం ఆయన పాలిసెట్ నిర్వహణపై కలెక్టరేట్‌లోని వీసీ హాలులో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ధర్మవరంలో 6 కేంద్రాల్లో 2,086 మంది విద్యార్థులు, హిందూపురం 6 కేంద్రాల్లో 1,885 మంది, కదిరిలోని 5 కేంద్రాల్లో 1,623 మంది పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రం వద్ద ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ను అందుబాటులో ఉంచి అవసరమైతే ప్రాథమిక చికిత్స అందించాలన్నారు. అలాగే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఫర్నీచర్, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఉంటుందన్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పాలిసెట కోఆర్డినేటర్‌గా ధర్మవరం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారన్నారు.
డీఆర్‌ఓ విజయసారథి


