రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం సిండికేట్ నగర్ రామకృష్ణ పురంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరు మండలం సింగారం కొత్తపల్లికి చెందిన రవిచంద్ర నాయుడు, రాధ దంపతులు బతుకు తెరువు కోసం 20 ఏళ్ల క్రితం అనంతపురం నగరానికి వలస వచ్చారు. హోటల్, వివిధ రకాల పనులతో జీవనం సాగిస్తున్న వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఉద్యోగాల నిమిత్తం ఒకరు బెంగళూరు, మరొకరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం రవిచంద్ర నాయుడు మృతి చెందాడు. అప్పటి నుంచి రాధ రామకృష్ణ పురంలోని అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసముంటోంది. గురువారం రాత్రి ఆమె హత్యకు గురైన విషయాన్ని స్థానికులు శుక్రవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ సీఐ శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలపై లోతైన గాయం, తీవ్రస్థాయిలో రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రాధ మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


