బొమ్మనహాళ్: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఏలంజి గ్రామానికి చెందిన గాదిలింగమ్మ, గంగన్న దంపతుల కుమారుడు వన్నూరుస్వామి (19) చేతి బోరు పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరికొందరితో కలిసి కొలగానహళ్లి గ్రామంలో రైతు చిరంజీవి పొలంలో చేతి బోరు వేసేందుకు శుక్రవారం వెళ్లాడు. బోరు వేస్తున్న సమయంలో ఇనుప పైపును పైకి ఎత్తుతున్న సమయంలో పైనున్న 11కేవీ విద్యుత్ లైన్ తగిలి షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన వన్పూరుస్వామిని స్థానికులు బళ్లారిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, వన్నూరు స్వామికి ఇటీవల వివాహ నిశ్చయమైంది. మరో మూడు నెలల్లో పెళ్లి ముహుర్తం నిర్ణయించుకున్నారు. ఇలాంటి తరుణంలో కుమారుడు మృతితో తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది.


