‘నవోదయ’కు హ్యుందాయ్‌ కంపెనీ చేయూత | - | Sakshi
Sakshi News home page

‘నవోదయ’కు హ్యుందాయ్‌ కంపెనీ చేయూత

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

రూ.41.15 లక్షల విలువ చేసే

పరికరాల వితరణ

లేపాక్షి: కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా హ్యుందాయ్‌ మోబీస్‌ కంపెనీ రూ.41.15 లక్షల విలువైన వస్తు సామగ్రిని శుక్రవారం ఉచితంగా అందజేసింది. 20 కంప్యూటర్లు, మూడు ప్రింటర్లు, ఒక్కొక్కటి చొప్పన చపాతి మేకింగ్‌ మెషిన్‌, ఇడ్లీ మేకింగ్‌ యూనిట్‌, 20 సీసీ కెమెరాలు, 506 స్టడీ చైర్స్‌, ఐదు క్లాస్‌ రూమ్‌ ఇంటరాక్టివ్‌ ఫ్యానెల్‌ పరికరాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ నాగరాజు మాట్లాడుతూ.. ఈ భారీ సాయం అందడం వెనుక కృషి చేసిన కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, గత జిల్లా కలెక్టర్‌ చేతన్‌కు కృతజ్ఙతలు తెలిపారు. అలాగే కంపెనీ యాంగ్‌ యెంగ్‌ డ్యూక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మిన్హోహు, హెచ్‌ఆర్‌ జీఏ కో–ఆర్డినేటర్‌ పీఎన్‌ శ్రీనివాస్‌, హెచ్‌ఆర్‌ డీఏ హోద్‌, సీఎస్‌ఆర్‌ ఇన్‌చార్జ్‌ జి.సింధూజకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జనగణనలో స్వీయగణన

అనంతపురం అర్బన్‌: రెండు దశల్లో చేపట్టిన జనగణన–2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహగణన ఇప్పటికే జిల్లాలో మొదలైంది. హెచ్‌ఎల్‌ఓ (హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌)లో భాగంగా ఇండ్ల జాబితా, గృహగణన చేపట్టారు. ఈ ప్రక్రియలో తొలిసారిగా స్వీయగణన నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 30 వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో https:// se. census. gov. in వెబ్‌సైట్‌ కానీ, మెచ్‌ఎల్‌ఓ యాప్‌ ద్వారా వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో లాగిన్‌ కాగానే మొబైల్‌ నెంబర్‌తో (ఓటీపీ ద్వారా) కుటుంబసభ్యుల సంఖ్య, పేరు, లింగం (జెండర్‌), వయసు, విద్యార్హత, వృత్తి, నివాస వివరాలు, ఇతర సామాజిక, ఆర్థిక వివరాలు నమోదు చేసి, సబ్మిట్‌ చేయాలి. అయితే సరైన, వాస్తవ సమాచారం మాత్రమే ఇవ్వాలి, ఒక కుటుంబాన్ని ఒకసారి మాత్రమే నమోదు చేయాలి. వివరాలను గోప్యంగా ఉంచుతారు. జనగణన ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరుతాయి. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయి. కచ్చితమైన జనాభా గణాంకాలు లభిస్తాయి.

వ్యక్తి ఆత్మహత్య

హిందూపురం: స్థానిక దేవరపల్లి రైల్వేస్టేషన్‌లో 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కీ మాన్‌ ముబారక్‌ సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి శరీరంపై ఓ గుడ్డ తప్ప ఎలాంటి దుస్తులు లేవు. మతిస్థితిమితం లేక రైలు కిందపడి మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

బోనులో చిక్కిన చిరుత

అమరాపురం: మండల సరిహద్దులోని అటవీ శివారు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టలేక అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. శివారున ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత వారం రోజులుగా కడేహుడే, నడలూడం గ్రామాల్లో సంచరిస్తోంది. విషయాన్ని గుర్తించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సంబందిత కర్ణాటకలోని చెళ్లకెర అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కడేహుడే గ్రామ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని చిరుతను ఆసక్తిగా గమనించారు. పట్టుబడిన చిరుతను అధికారులు చెళ్లకెరలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.

టీసీసీ ఫలితాల విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: గత ఫిబ్రవరిలో జరిగిన టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ–2026) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఠీఠీఠీ. ఛట్ఛ. ్చఞ. జౌఠి. జీుఽ వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయని అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. డ్రాయింగ్‌, హ్యాండ్లూమ్‌, వీవింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌లలో పరీక్షలు రాసిన విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి మార్కుల జాబితాను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement