వడదెబ్బతో బేల్దారి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో బేల్దారి మృతి

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

యాడికి: అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా ఒక బేల్దారి వడదెబ్బకు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రంలోని తిప్పారెడ్డిపల్లి రహదారిలో నివసిస్తున్న కుమ్మర శ్రీనివాసులు(35) బేల్దారి పనులు చేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.

గరుడ వాహనంపై శ్రీవారు

బొమ్మనహాళ్‌: మండల కేంద్రంలో వేంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి వవేంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీనివాసుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణ, కుంకుమార్చన, అభిషేకం, పంచామృతాభిషేకం , సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు, మహామంగహారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారిని గరుడ వాహనంపై కూర్చోబెట్టి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకీలో ఊరేగించారు. స్వామివారికి అడుగడుగునా ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అనతరం గరుడ వాహనోత్సవానికి సహకరించిన దాతలను పూలమాల, శాలువాతో సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement