అనంతపురం సెంట్రల్: సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను దూషించిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వైఎస్సార్‌సీపీ మహిళా నేత, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్‌పర్సన్ మాల్యవంతం మంజుల ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలతో కలిసి శుక్రవారం అనంతపురం టూటౌన్ పోలీసులను ఆమె కలిసి ఫిర్యాదును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి నాడు ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు వెళుతున్న తనను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దూషించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. తమను రానీయకండంటూ సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన భర్త పెన్నోబులేసుతో ఉన్న రాజకీయ విభేదాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగతంగా తనను అసభ్యకరంగా దూషించాడని తెలిపారు. తన భర్తను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనను, తన భర్తను బెదిరిస్తున్నారని, తమకు ఏమైనా జరిగితే దానికి ఎంఎస్ రాజునే కారణమవుతారని స్పష్టం చేశారు. మహిళలంటే ఏ మాత్రం గౌరవం ఉంటే తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే వైఎస్సార్‌సీపీ మహిళలంతా కలిసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, నాయకురాలు అంజలి, శోభ, పార్వతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ జోనల్ మాజీ చైర్‌పర్సన్ మంజుల


