చిలమత్తూరు: సాధారణంగా ఎక్కడ డ్రెయినేజీ వేసినా రోడ్డు పక్కన తవ్వి లైనింగ్ తోటి పూర్తి చేయడం పరిపాటి. అయితే చిలమత్తూరు మండలం మాదిరెడ్డిపల్లిలో వేసిన డ్రెయినేజీని చూసిన వారు అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను టీడీపీ నేతలు చేజిక్కించుకుని ఇష్టానుసారంగా పూర్తి చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే మాదిరెడ్డిపల్లిలో ఇటీవల డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. అయితే రోడ్డు పక్కన తవ్వి కాకుండా ఏకంగా సీసీ రోడ్డపైనే రెండు వైపులా చిన్నపాటి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణం పూర్తి చేశారు. ఈ పనిని ఆక్షేపించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి జీ హుజూర్ అంటూ తలొగ్గారు. పనులు చేయకుండానే చేసినట్టు చూపించి బిల్లులు పొందే ఎత్తుగడకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


