కదిరి టౌన్: స్థానిక అడపాలవీధికి చెందిన వివాహిత గాయత్రీదేవి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... ఇందిరమ్మ కాలనీకి చెందిన శరత్‌కుమార్‌తో గాయత్రీ దేవికి పెళ్లి కాగా, కొంత కాలంగా మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇదేమని ప్రశ్నించినందుకు గాయత్రీదేవిని వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా శరత్‌కుమార్‌లో మార్పు రాకపోవడంతో పోలీసులకు గాయత్రీదేవి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అత్త శ్యామలతో పాటు భర్త ప్రియురాలి వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో రెండు రోజుల క్రితం గాయత్రీదేవి ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
ద్విచక్ర వాహన
దొంగను పట్టుకున్న ప్రజలు
ధర్మవరం అర్బన్: పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని అపహరించుకెళుతున్న యువకుడిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు... ధర్మవరంలోని సాయినగర్‌లో శుక్రవారం వేకువజాము 1.45 గంటలకు ఓ యువకుడు వీధిల్లో సంచరిస్తూ చిన్నారుల సైకిల్ అపహరించి, దానిపై చక్కర్లు కొడుతూ పీర్లచావిడి వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఓ ఇంటి ఎదుట నిలిపి ఉన్న టీవీఎస్ బైక్‌ను అపహరించాడు. ఆ సమయంలో కుక్కలు మొరగడంతో స్థానికులు అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని తీసుకెళుతున్న యువకుడిని అడ్డుకుని బంధించారు. అనంతరం సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించి, విచారణ చేపట్టారు.


