ధర్మవరం అర్బన్: తమ వద్ద చీరలు తీసుకుని డబ్బులివ్వకుండా మోసం చేసిన శ్రీకలైవాణి శిల్క్స్ యజమానురాలిపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని పలువురు చేనేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారంతా స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నమక్కల్ జిల్లా తిరుచెన్‌గోడ్ పట్టణానికి చెందిన కలైవాణి అక్కడే శ్రీకలైవాణి శిల్క్స్ పేరుతో పట్టుచీరల షోరూం నిర్వహిస్తున్నారు. 2023లో ధర్మవరంలోని వ్యాపారస్తుల వద్ద నుంచి రూ.80 లక్షల విలువైన పట్టు చీరలను కొనుగోలు చేశారు. ఇందుకు గాను అప్పట్లో ఆమె చెక్కులు ఇచ్చారు. అయితే ఆమె ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కులన్నీ చెల్లకుండా పోయాయి. దీంతో ధర్మవరం వ్యాపారస్తులు కోర్టును ఆశ్రయించారు. గురువారం వాయిదా ఉండడంతో కలైవాణి కోర్టుకు హాజరయ్యారు. గుర్తించిన పట్టుచీరల వ్యాపారస్తులు ఆమెను వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్‌కు అప్పగించారు. తమకు న్యాయం చేయాలంటూ పీఎస్ ఎదుట నిరసన చేపట్టారు. ఆ సమయంలో వ్యాపారస్తులతో సీఐ నాగేంద్రప్రసాద్ మాట్లాడి, కలైవాణిపై కేసు నమోదు చేస్తామని తెలపడంతో వ్యాపారులు అంగీకరించి, ఆందోళనను విరమించారు.
పోలీసు స్టేషన్ ఎదుట చేనేతల నిరసన


