కదిరి అర్బన్: ‘‘ఆ ఇంట్లో పొగలొస్తున్నాయి...ఏందో అంటుకుంది..బిందెలతో నీళ్లు తీసుకురండి’’ అంటూ జనం ప్రమాదం జరిగిన ఇంటివైపు వెళ్తున్న వీడియో ఒకటి గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బుధవారం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో జిలెటిన్ స్టిక్స్ పేలి నలుగురు మృత్యువాత పడగా...28 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే పేలుడుకు ముందే ఆ ఇంట్లో ఉన్నవారంతా పరారీ కాగా, ఇరుగూపొరుగు వారు మాత్రం...ఇంట్లోంచి పొగలు రావడం చూసి సాయం చేసేందుకు పరుగున వచ్చారు. కొందరైతే బిందెలతో నీటిని తెచ్చి మంటలను ఆర్పేందుకు యత్నించడం వీడియోలో కనిపించింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే పేలుడు సంభవించడంతో దృశ్యాలు మాయమై...కేవలం మహిళల ఆర్తనాదాలు వినిపించాయి. ఈ వీడియో చూసిన వారంతా అయ్యో...ఎంత పని జరిగింది... సాయం చేసేందుకు వెళ్లిన వారిని తీసుకెళ్లావా దేవుడా అంటూ కన్నీరుపెట్టుకున్నారు.
పేలుడుకు కొన్ని క్షణాల ముందు వీడియో వైరల్


