చిలమత్తూరు: హిందూపురంలోని ఆబాద్‌పేటలో నివాసముంటున్న న్యాయవాదులు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకుడు ఉదయ్‌సింహారెడ్డి, యూసఫ్‌పై మున్సిపల్ అధికారులు మంగళవారం రాత్రి దురుసుగా వ్యవహరించిన వైనం వివాదాస్పదమైంది. ‘రేయ్’ అంటూ రెచ్చగొట్టి దుర్భాషలాడారు. ఆ సమయంలో న్యాయవాదులు ఆగ్రహానికి లోను కాగానే వెంటనే మున్సిపల్ కమిషనర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసి, అక్రమంగా కేసులు బనాయించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తప్పును కప్పిపుచ్చుకుంటూ..
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆబాద్‌పేట్‌లో డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్విన గుంతలు 15 రోజులైనా పూడ్చకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. డ్రైనేజీ కింద పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ అంశాన్ని స్థానికులు వ్యతిరేకించారు. పైప్‌లైన్ దెబ్బతింటే డ్రైనేజీ నీరు అందులో కలిసి తాగునీరు కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా వెన్నంటి ఉంటూ పనులు పూర్తి చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి డ్రైనేజీ గుంతలను పరిశీలించేందుకు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది వెళ్లారు. ఆ సమయంలో న్యాయవాదులు ఉదయ్, యూసఫ్ స్థానికులు అక్కడకు చేరుకుని అధికారులను నిలదీశారు. 15 రోజులైనా పనులు పూర్తి చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీంతో తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ‘మీరెవరూ మమ్మల్ని ప్రశ్నించేందుకు’ అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అక్కడకు చేరుకుని న్యాయవాదులపై రెచ్చిపోయారు. పబ్లిక్ సర్వెంట్‌గా బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ ప్రజలతో ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని న్యాయవాదులు హితవు పలకబోతుండగా కమిషనర్ ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు ఎమ్మెల్యే పీఏల అండ ఉందని, మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో న్యాయవాదులు ఆవేశానికి లోనుకాగా, వెంటనే సీఐ రాజగోపాలనాయుడుని రప్పించుకుని కుట్రకు తెరలేపారు.
అక్రమంగా కేసు నమోదు
సీఐ సూచన మేరకు తన విధులకు ఆటంకం కలిగించారంటూ న్యాయవాదులపై పోలీసులకు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. దీనిపై కనీస విచారణ కూడా చేపట్టకుండా పోలీసులు సైతం ఆగమేఘాలపై కేసు నమోదు చేసేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా విస్తుపోయారు. న్యాయవాదులని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అక్రమంగా కేసులు బనాయిస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పన్నులతో జీతభత్యాలు తీసుకుంటూ ప్రజలపైనే కక్షపూరితంగా వ్యవహరించడం మున్సిపల్ అధికారులకు తగదంటున్నారు.
ప్రజలు ఇబ్బంది పడుతున్నారని
తెలిపినందుకు లాయర్లపై దాడికి యత్నం
సర్దిచెప్పాల్సిన తరుణంలో
ఆజ్యం పోసిన పోలీసులు
రెచ్చగొట్టి న్యాయవాదులపైనే ఫిర్యాదు, అక్రమ కేసు నమోదు
మున్సిపల్ కమిషనర్ తీరుపై
సర్వత్రా విమర్శలు
హిందూపురంలో న్యాయవాదులపై మున్సిపల్ అధికారుల దురుసు ప్రవర్తన వివాదానికి దారితీసింది. సర్దిచెప్పాల్సిన తరుణంలో పోలీసులు సైతం వివాదానికి ఆజ్యం పోశారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదు చేయాలని సూచించి, ఆ మేరకు ఫిర్యాదు అందగానే ఆగమేఘాలపై కేసులు కట్టేశారు.


