మడకశిరరూరల్: మండలంలోని ఎగువ అచ్చంపల్లి గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారిందంటూ బుధవారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తాగునీటి పథకం బోరుబావుల్లో అరకొరగా వస్తున్న తాగునీరు కాలనీ వాసుల అవసరాలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, కార్యదర్శి వేణుగోపాల్ అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా బోరు వేయిస్తామని, అప్పటి వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా తీసుకుంటామని భరోసానిచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు.
పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఇద్దరికి స్థానం
అనంతపురం టౌన్: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరికి స్థానం కల్పిస్తూ ఆ పార్టీ అధిష్టానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు మరోమారు అవకాశం కల్పించారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. దీంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతనిధులుగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, గుణపాటి దీపక్‌రెడ్డిను నియమించారు. వీరితోపాటు జిల్లా నుంచి పలువురికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి స్థానం కల్పించారు.
పద్మపీఠంపై అభయ
ఆంజనేయస్వామి విగ్రహం
హిందూపురం: రాయలసీమలోనే అత్యంత ఎత్తైన అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహాన్ని హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామి దేవాలయం మైదానంలో ఏర్పాటు చేసిన పద్మపీఠంపై బుధవారం అధిష్టింపజేశారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందు కోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా భారీ క్రేన్, జేసీబీలను తెప్పించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ వైసీ చంద్రశేఖర్, సభ్యులు పర్యవేక్షించారు. కాగా 45 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహం ఏర్పాటుకు హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ అవనీష్‌రెడ్డి, అఖిలేష్‌రెడ్డి రూ.6 లక్షక్షను వైసీ చంద్రశేఖర్, వైసీ కార్తీక్‌కు అందజేశారు.
పర్యావరణ పరిరక్షణ
అందరి బాధ్యత
ఎన్‌పీకుంట: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలని, ఈ అంశంపై ‘సేవ్ ట్రీస్ – సేవ్ వాటర్’ నినాదంతో ప్రజలను చైతన్య పరుస్తూ భారత దేశమంతటా సైకిల్ యాత్ర చేపట్టినట్లు విశాఖపట్నానికి చెందిన కర్రీరాము ఆచార్య తెలిపాడు. 40 నెలలుగా సాగుతున్న తన సైకిల్ యాత్రలో అనుకూలమైన ప్రతి చోట మొక్కలను నాటిస్తూ, వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్తులో కలిగే లాభాలపై స్థానికులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. బుధవారం సైకిల్ యాత్ర ఎన్‌పీకుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా అతనికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని ఓ టీ కేఫ్ వద్ద మొక్కను నాటి, మాట్లాడారు. రోజుకు 100 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌జీఓలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు సహకారం అందిస్తున్నారన్నారు.
మద్యం దుకాణం సీజ్
శింగనమల: మండల కేంద్రంలోని మద్యం దుకాణాన్ని ఎకై ్సజ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. బుక్కరాయసముద్రం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని శింగనమల, గార్లదిన్నె, నార్పల మండలాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శింగనమలలోని దుకాణంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.


