బాలికల హవా | - | Sakshi
Sakshi News home page

బాలికల హవా

Apr 16 2026 10:36 AM | Updated on Apr 16 2026 10:36 AM

పుట్టపర్తి: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లోనూ అమ్మాయిలే అగ్రస్థానంలో నిలిచారు. బుధవారం ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లా నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 10,288 మంది పరీక్షలు రాయగా, 7,378 మంది (72 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్‌ తెలిపారు. అలాగే ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 10,395 మంది పరీక్ష రాయగా 6,969 మంది (67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఒకేషనల్‌ విభాగంలో సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 425 పరీక్షలు రాయగా, 258 మంది (60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 1350 మంది పరీక్ష రాయగా 626 మంది (46 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ వెల్లడించారు.

మెరుగు..తరుగు

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా స్థానం కాస్త మెరుగుపడింది. గత ఏడాది ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది మూడు ర్యాంకులు మెరుగుపర్చుకుని 20వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో గత ఏడాది 21వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది ఒక మెట్టు దిగజారి 22వ స్థానంలో నిలిచింది.

ఫస్ట్‌ ఇయర్‌ జిల్లా టాపర్‌ జయశ్రీ

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో హిందూపురం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని జయశ్రీ (సీఈసీ) 500 మార్కులకు 494 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. అలాగే కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని నహిద్‌ (బైపీసీ) 455 మార్కులకు 442 మార్కులు సాధించి రెండో స్థానంలోనూ, అమరాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని షన్ముఖి (హెచ్‌ఈసీ) 500 మార్కులకు 480 మార్కులు సాధించి మూడో స్థానంలో, నల్లమాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి సాయి సుధ (ఎంపీసీ) 470 మార్కులకు గాను 433 మార్కులు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు.

మెరిసిన చాందిని

సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని చాందిని(బైపీసీ) 1000 మార్కులకు 991 మార్కులు సాధించి జిల్లా టాపర్‌ గా నిలిచారు. ఇక ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని భవాని (ఎంపీసీ) 986 మార్కులు సాధించి రెండో స్థానంలోనూ, తలుపుల జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని శ్రీసంగీత 953 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

బాలికలదే హవా

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో బాలికలదే హవా కొనసాగింది. జనరల్‌లో మొదటి సంవత్సరంలో బాలికలు 4,076 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 2,770 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరంలో బాలికలు 4,209 మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 3169 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు

ఫస్ట్‌ ఇయర్‌ 67, సెకండ్‌ ఇయర్‌ 72 శాతం ఉత్తీర్ణత

ఫస్ట్‌ ఇయర్‌లో రాష్ట్రంలోనే జిల్లాకు 20వ స్థానం, సెకండ్‌ ఇయర్‌లో 22వ స్థానం

మెరిసిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement