ప్రశాంతి నిలయం: జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ విజయ సారథితో కలిసి కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనగణన గురించి వివరించారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ( https:// se. census. gov. in) ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై ఈ నెల 16వ తేదీ నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులంతా సమష్టిగా పనిచేసి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జనగణనను పక్కాగా చేయాలన్నారు.
జిల్లాలో స్వీయగణన షెడ్యూల్ ఇలా..
● తొలిరోజు 16వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ ప్రతినిధుల గణనతో స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమవుతుంది.
● 17వ తేదీన సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
● 18వ తేదీన పద్మ అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, కళాకారులు వంటి ప్రముఖ వ్యక్తుల స్వీయగణన.
● 19వ తేదీన స్వయం సహాయ సంఘాల సభ్యులు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
● 20వ తేదీన ఉపాధి హామీ పథకం కూలీలకు మొదటి విడత అవగాహన కల్పిస్తారు.
● 21వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల స్వీయగణన ఉంటుంది.
● 22న విశ్వవిద్యాలయ, కళాశాల విద్యార్థులు స్వీయగణన ప్రక్రియలో పాల్గొంటారు.
● 23వ తేదీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల వివరాల నమోదు ఉంటుంది.
● 24వ తేదీన గిరిజన ప్రాంతాలు, వారపు సంతల వద్ద స్వీయగణన ప్రక్రియను అధికారులు నిర్వహిస్తారు.
● 25న పట్టణ ప్రాంతాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వృద్ధాశ్రమాల్లో స్వీయగణన ఉంటుంది.
● 27న బ్యాంకులు, పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, 28న డ్వాక్రా సంఘాల రెండో విడత, 29న పోలీస్ సిబ్బందికి, 30వ తేదీన ఉపాధి హామీ కూలీల రెండో విడతగా స్వీయ గణన ఉంటుందని కలెక్టర్ వివరించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ సూచించారు.
15 రోజుల పాటు స్వీయ గణన కార్యక్రమం
విలేకరుల సమావేశంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్


