కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటన బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ తెలిపారు. బుధవారం ఆయన కుమ్మరవాండ్లపల్లిలో ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. క్షత్రగాత్రులకు ధైర్యం చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ ప్రణీత్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జైనుల్లా బాధితులను ఓదార్చారు.
కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. బుధవారం కదిరి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో నలుగురు మృతిచెందగా... మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు పేర్కొన్నారు. ఇదే ఘటనలో మరో 17 మంది గాయపడ్డారన్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వం తరఫున పక్కాగృహం మంజూరు చేస్తామని చెప్పారు.


