నేడు ఇంటర్‌ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

నేడు ఇంటర్‌ ఫలితాలు

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్‌ బోర్డు బుధవారం ఉదయం 10.31 గంటలకు విడుదల చేయనుంది. జిల్లాలో వేలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ BIEAP Results Portal ద్వారా హాల్‌ టికెట్‌ నంబర్‌ నమోదు చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ‘మన మిత్ర’ వాట్సాప్‌ సేవ ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. ఇందుకోసం 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ పంపితే ఫలితాలు అందుతాయి. ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్‌పై భారీ ట్రాఫిక్‌ ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఓపికగా ప్రయత్నించాలని అధికారులు సూచించారు.

ఆర్‌ఎంపీ క్లినిక్‌ల సీజ్‌

అమరాపురం: మండల కేంద్రంలోని రెండు ఆర్‌ఎంపీ క్లినిక్‌లను తహసీల్దార్‌ లక్ష్మీ నరసింహ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భార్గవ్‌ ఆధ్వర్యంలో సీజ్‌ చేశారు. వారు మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. స్టెరాయిడ్‌, ఇంజక్షన్లు, ఓవర్‌ డోస్‌లు వేయకూడదని సూచించారు. ఇవన్నీ ఆయా క్లినిక్‌లలో నిర్వహిస్తుండటంతో సీజ్‌ చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

తలుపుల: మండలంలోని ఉడమలకుర్తి పంచాయతీ చిన్నపల్లి గ్రామానికి చెందిన రైతు పి.వెంకటరమణ (57) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య రమణమ్మ, కుమారుడు మల్లికార్జున ఉన్నారు. తన పొలంలో సాగు చేసిన వేరుశనగ పంటకు నీరు పెట్టేందుకు సోమవారం రాత్రి వెళ్లిన వెంకటరమణ... అక్కడ మోటార్‌ స్టార్టర్‌ పెట్టె వద్ద కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా తండ్రి ఇంటికి రాకపోవడంతో కుమారుడు నేరుగా పొలం వద్ద కెళ్లి పరిశీలించాడు. విగతజీవిగా పడి ఉన్న తండ్రిని గమనించి రోదిస్తూ సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేశాడు. ఘటనపై మల్లికార్జున ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

వైభవంగా

పెద్దమ్మతల్లి జాతర

అనంతపురం కల్చరల్‌: నగరంలోని ఐదో రోడ్డులోని పెద్దమ్మ తల్లి జాతర మంగళవారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనానికి అన్నప్రసాద వితరణ జరిగింది. నిర్వాహకులు రంగా, సాయి, ఆంజనేయులు, నాగరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement