మామిడి పండు..
● మామిడి పండ్ల నిగనిగల వెనుక పొంచి ఉన్న అనారోగ్యం
● పక్వానికి రాకమునుపే రసాయనాల ద్వారా మాగబెడుతున్న పరిస్థితి
● ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న నిపుణులు
● ఉమ్మడి జిల్లాలో 84వేల ఎకరాల్లో మామిడి సాగు
అనంతపురం అగ్రికల్చర్/తాడిపత్రి రూరల్/హిందూపురం: వేసవి ఫలరాజు ‘మామిడి’ మార్కెట్‌లోకి వచ్చింది. ఏడాదిలో రెండు మూడు నెలలు కనిపించే నిగనిగలాడే మధురమైన మామిడిని ఆస్వాదించేందుకు జనం రెడీగా ఉన్నారు. ఫలాలన్నింటిలోకి ప్రత్యేక స్థానం కలిగిన ‘మామిడి’ ప్రస్తుతం కొందరి స్వార్థం కారణంగా కలుషితమై ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు వచ్చే మామిడి కాయలను సంప్రదాయ రీతుల్లో కాకుండా కృత్రిమ విధానాల్లో మగ్గిస్తుండడమే ఇందుకు కారణం.
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా..
ఉమ్మడి జిల్లాలో దాదాపు 84వేల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. జిల్లాలో చీనీ తరువాత అతిపెద్ద వాణిజ్య పంటగా మామిడిని రైతులు పండిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, పెద్దవడుగూరు, బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి, తాడిపత్రి, యల్లనూరు మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, రొద్దం, చిలమత్తూరు, హిందూపురం, కదిరి, తలుపుల, ఎన్‌పీకుంట, తనకల్గు, ముదిగుబ్బ తదితర మండలాల్లో అత్యధికంగా సాగులో ఉంది. కాయలతో ఉన్నా తోటలను వ్యాపారులు హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు.
మోతాదు మించితే ఇథలిన్ కూడా
ప్రమాదకరమే
గతంలో రైతులు శాసీ్త్రయ పద్ధతుల్లో మామిడి కాయలను మగ్గించి విక్రయాలు సాగించేవారు. ఆ తర్వాత టోకుగా తోటల్లోని ఫలసాయాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ద్వారా 24 గంటల్లోపు మామిడి కాయలను మగ్గించి ప్రజారోగ్యంతో చెలగాటమాడసాగారు. ఈ క్రమంలో ఇథలిన్ గ్యాస్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. కాల్షియం కార్బైడ్‌తో మగ్గించిన కాయల కంటే ఇథలిన్ గ్యాస్ వినియోగం ద్వారా దుష్ఫలితాలు తగ్గాయి. అయితే మోతాదుకు మించి ఇథలిన్ గ్యాస్ వినియోగిస్తే అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదముంటుందని పేర్కొంటున్నారు.
మూతపడుతున్న రైపనింగ్ సెంటర్లు
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇథలిన్ గ్యాస్ రైపనింగ్ సెంటర్లు పలు సాంకేతిక కారణాలతో మూతపడుతున్నాయి. తాడిపత్రిలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇథలిన్ రైపనింగ్ సెంటర్ కేవలం రెండేళ్లు కూడా నడవలేదు. మునిసిపాలిటీ ఆధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ సెంటర్ కాస్త మూతపడింది. ఈ క్రమంలోనే ఇథలిన్ గ్యాస్‌తో పండ్లను మాగబెట్టడం ఖర్చుతో కూడుకుంటోందనే నెపంతో జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు తిరిగి కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెలిసినా మునిసిపల్ ఆధికారులు పట్టించుకోవడం లేదు.
రసాయనాలతో మాగబెడుతున్న పరిస్థితి
మామిడి పండ్లు సహజంగా పక్వానికి రాకముందే వ్యాపార ధోరణితో కొందరు త్వరగా మాగేలా కృత్రిమ పక్వం (ఆర్టిఫిషియల్ రైపనింగ్) చేస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. కృత్రిమంగా మాగబెట్టడానికి చాలా మంది కాల్షియం కార్బైడ్ వాడుతున్నారు. ఇది తేమ తగిలినపుడు అసిటిలిన్ వాయువు విడుదల చేస్తుంది. ఈ వాయువు పండ్లను త్వరగా పసుపు రంగులోకి మారేలా చేస్తుంది. రూ.80 ఖర్చుతో ఒక కిలో కాల్షియం కార్బైడ్ ద్వారా 5 నుంచి 10 టన్నుల వరకు మామిడి కాయలను కేవలం 24 గంటల్లోనే మాగబెట్టవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, చర్మ అలర్జీలు వస్తాయి. దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై అనారోగ్య ప్రభావం అధికంగా ఉంటుంది. క్యాల్షియం కార్బైడ్‌ను నిషేధించినా కొందరు రహస్యంగా వాడుతూనే ఉండడం ఆందోళనకరం.
– ఆర్.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వినియోగదారుల సంఘాల సమాఖ్య
కాల్షియం కార్బెట్ హానికరం
కాల్షియం కార్బెట్‌తో మాగబెట్టిన మామిడి కాయలతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎక్కువగా వాంతుల, విరేచనాలు, చికాకు, చర్మ సమస్యలు కనిపిస్తాయి. దీర్థకాలంలో క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. శాసీ్త్రయ పద్ధతుల్లో మగ్గించిన మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది.
– అనిల్, వైద్యుడు, తాడిపత్రి
కొనే ముందు పరిశీలించాలి
మామిడి పండ్లను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ఒకసారి పరిశీలించాలి. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువకాలం నిల్వ ఉండడమే కాక తియ్యటి వాసనతో ఉంటాయి. కృత్రిమంగా మాగిన మామిడి పండ్లలో పై పొర ముడతలు లేకుండా గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు కనిపిస్తాయి. అలాగే మామిడి పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15 నుంచి 20 నిముషాల పాటు ఉంచి తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడిలేకుండా తుడిచిన తర్వాత వాటిని తినాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. – మహేష్, ఉద్యాన అధికారి, హిందూపురం


