పుట్టపర్తి టౌన్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే నష్ట తీవ్రత తగ్గుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్, జిల్లా అగ్ని మాపక శాఖఅధికారి మాధవనాయుడు అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను అగ్నిమాపక సిబ్బందితో కలసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. అనంతరం స్థానిక ఫైర్ స్టేషన్‌లో విఽధి నిర్వహణలో అశువులు బాసిన ఫైర్‌మెన్లకు నివాళులర్పించారు. ఫైర్ వాహనాలతో ర్యాలీ నిర్వహించి, అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఎస్‌ఓ నాగరాజునాయక్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.
చైన్ స్నాచర్ అరెస్ట్
హిందూపురం: బంగారు గొలుసు అపహరణ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం యూజీ రూరల్ పీఎస్ సీఐ ఆంజనేయులు తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. హిందూపురం మండలం కిరికెర సమీపంలోని సూర్యకోచ్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న మారుతీ లేవుట్‌లో నివాసముంటున్న సుశీలమ్మ నడవలేని స్థితిలో సోమవారం తన ఇంటి ఎదుట కూర్చొని ఉన్న సమయంలో అప్పలకుంటకు చెందిన అనిల్ అక్కడకు చేరుకుని ఆమె మెడలోని ఆరు తులాల బంగారు తాళి బొట్టు గొలుసును లాక్కొని ఉడాయించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలు సేకరించి, మంగళవారం కొటిపి రైల్వే గేట్ వద్ద తచ్చాడుతున్న అనిల్ అలియాస్ వడ్డే అనిల్‌ను అరెస్ట్ చేశారు. బంగారు గొలుసుతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. కేసును ఒక్కరోజులోనే ఛేదించిన సీఐ ఆంజినేయులు, ఎస్‌ఐ నంజప్ప, ఏఎస్‌ఐ శ్రీరాములు, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్, డీఎస్పీ మహేష్ అభినందించారు.
రేపటి నుంచి జనగణన
● ఈ నెల 16 నుంచి 30 వరకు స్వీయగణన
అనంతపురం అర్బన్: జనగణన–2027 ప్రక్రియ ఈ నెల గురువారం ప్రారంభం కానుంది. రెండు దశల్లో గణన ఉంటుంది. మొదటి దశలో గృహగణన నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలిసారి స్వీయ గణన నిర్వహణ ఉంటుంది. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ( https:// se. census. gov. in) ద్వారా నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు. దీనిపై ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వీయగణన ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరినీ దీని కోసం నిర్బంధించకూడదంటూ ఇప్పటికే జిల్లా సెన్సన్ అధికారులు స్పష్టం చేశారు.
స్వీయగణన షెడ్యూల్ ఇలా..
● తొలిరోజు 16వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ ప్రతినిధుల గణనతో ప్రారంభమవుతుంది.
● 17న సచివాలయ సిబ్బంది, కలెక్టరేట్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
● 18న అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, కళాకారులు వంటి ప్రముఖ వ్యక్తుల స్వీయగణన.
● 19న స్వయం సహాయ సంఘాల సభ్యులకు, 20న ఉపాధి హామీ పథకం కూలీలకు మొదటి విడత అవగాహన కల్పిస్తారు. 21న జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల స్వీయగణన.
● 22న విద్యార్థులు స్వీయగణన ప్రక్రియలో పాల్గొంటారు. 23న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల నమోదు. 25న గిరిజన ప్రాంతాలు, వారపు సంతల వద్ద స్వీయగణన ప్రక్రియ నిర్వహిస్తారు.
● 25న పట్టణ ప్రాంతాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వృద్ధాశ్రమాల్లో స్వీయగణన.
● 26న ప్రజల్లో అవగాహన కోసం జిల్లా కేంద్రంలో సెన్సస్– 5కె రన్ నిర్వహిస్తారు.
● 27న డ్వాక్రా సంఘాలకు రెండవ విడత, 29న పోలీసు సిబ్బందికి స్వీయగణన. 30న ఉపాధి కూలీలకు రెండవ విడతగా స్వీయగణన ప్రక్రియ నిర్వహిస్తారు.


