అమరాపురం: మండల కేంద్రంలో వెలసిన ఆదినాథ తీర్థంకర వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆది తీర్థంకర మూలవిరాట్‌కు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా జైన మతస్తులు ఆది తీర్థంకర ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. 108 కలశాలతో భక్తులు పాల్గొన్నారు. తీర్థప్రసాద వినియోగం అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో బెంగళూరులో స్థిరపడిన అమరాపురం వాసులు పాల్గొన్నారు.
అలరించిన సంగీత విభావరి
ప్రశాంతినిలయం: సాయికుల్వంత్ సభామంటపంలో రెండో రోజూ తమిళ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా సాగాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కీర్తనా భరద్వాజ్ కర్ణాటక సంగీత కచేరీతో భక్తులను మైమరిపించారు. సంప్రదాయ తేవారంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె శాశ్వతమైన తమిళ భక్తి గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం బ్రోచేవారెవరురా, మోక్షము కలదా కృతులతో భక్తి భావాన్ని ఆవిష్కరించారు. కీర్తనా భరద్వాజ్ బృందాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, ఆయన భార్య హిమవాహిణి సత్కరించారు.
న్యాయవాదులపై ఫిర్యాదు
హిందూపురం: స్థానిక అబాద్ పేటలో డ్రెయినేజీ నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందిని అవమానిస్తూ మాట్లాడరంటూ న్యాయవాదులు ఉదయ్‌సింహారెడ్డి, యూసుఫ్‌పై వన్‌టౌన్ పోలీసులకు హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునతో కలిసి బాధిత ఇంజనీరింగ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. వివరాలు.. న్యాయవాదులు నివాసముంటున్న ప్రాంతంలో కాలువ పనుల కోసం తవ్వి వదిలేశారు. దీంతో మంగళవారం అక్కడకు చేరుకున్న మున్సిపల్ సిబ్బందిని న్యాయవాదులు ప్రశ్నించారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య వాదన చోటు చేసుకుంది. కాగా, తాము న్యాయవాదులమని చెబుతున్నా వినకుండా మున్సిపల్ సిబ్బంది అమర్యాదగా వ్యవహరిస్తూ వీడియోలు తీసి అవమాన పరిచారంటూ న్యాయవాదులు ఆరోపించారు. తమను దోషిగా చూపించేలా సిబ్బంది వ్యవహరించిన తీరు సరికాదన్నారు. అధికారులు ప్రజాసేవకులేననే విషయాన్ని గుర్తించాలన్నారు. సకాలంలో కాలువ పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఇందుకు స్థానికులతో కలిసి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అనుకుంటున్న తరుణంలో స్వీయ రక్షణలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనాల ఢీ –
ఒకరి మృతి
అమరాపురం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని శిర తాలూకా కురుబర రామనహళ్లి గ్రామానికి చెందిన భూతరాజు (30) తన స్నేహితుడితో కలసి మంగళవారం అమరాపురం మండలం బసవనపల్లి సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వచ్చాడు. ఈత ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఉప్పార్లపల్లి క్రాస్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన భూతరాజును వెంటనే శిర ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, అప్పుటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.


