బ్యాంకులు మరింత ప్రగతి సాధించాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని బ్యాంకులు మరింత ఆర్థిక ప్రగతి సాధించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని వీసీ హాలులో డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని వివిధ బ్యాంకుల పనితీరు, పురోగతిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ... జిల్లాలోని వివిధ బ్యాంకులకు సంబంధించిన 235 శాఖలున్నాయన్నారు. అన్ని బ్యాంకులు కలిపి రూ.11,565 కోట్ల డిపాజిట్లు సేకరించాయని, అలాగే రూ.21,019 కోట్లు రుణాలిచ్చాయని తెలిపారు. వ్యవసాయ రుణాలు రూ.7,587 కోట్లు ఇవ్వాలని అన్ని బ్యాంకులకు లక్ష్యం నిర్దేశించగా...3,84,727 మంది రైతులకు రూ.6244 కోట్లు (82 శాతం) మంజూరు చేశాయన్నారు. అలాగే వ్యవసాయ టర్మ్ లోన్లు రూ.2,600 కోట్ల లక్ష్యానికి గాను 86,796 మంది రైతులకు రూ.2451 కోట్లు (94.25 శాతం) అందించాయన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రూ.1,144 కోట్ల రుణాలు మంజూరు చేశాయన్నారు. ఇక ప్రాధాన్యతా రంగాలకు రూ.10,501 కోట్లు పంపిణీ చేశారన్నారు. అన్ని బ్యాంకులు 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి లక్ష్యానికి మించి రూ.14,541 కోట్లు రుణాలు పంపిణీ చేశాయన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం రమణ కుమార్, జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను
ప్రోత్సహించండి..
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో డీఐపీసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు కూడా నిబంధనల మేరకు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. 2024 నవంబర్ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న 12 ఒప్పందాల మేరకు ఆయా పరిశ్రమలకు త్వరగా అనుమతులివ్వాలన్నారు. అనంతరం పెట్టుబడి రాయితీ కింద 16 పరిశ్రమలకు, వడ్డీ రాయితీ కింద ఒక పరిశ్రమకు రాయితీలు మంజూరు చేస్తూ ఆమోదించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణకుమార్, డీఐసీ జనరల్ మేనేజర్ నాగరాజు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అధ్యక్షతన డీఎల్‌ఆర్‌సీ సమావేశం


