డ్రోన్ నిఘా.. పేకాట స్థావరంపై దాడి
● ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
ఓడీచెరువు(అమడగూరు): డ్రోన్ నిఘా సత్ఫలితాలనిస్తోంది. అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకు అవకాశం కలుగుతోంది. అమడగూరు మండలం కొట్టువారిపల్లి గ్రామ సరిహద్దులో గాంబ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో నల్లమాడ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అమడగూరు ఎస్‌ఐ గోపాలకృష్ణ సిబ్బందితో కలిసి డ్రోన్ ద్వారా నిఘా ఉంచారు. ఈ క్రమంలో కొట్టువారిపల్లి గ్రామ సమీపంలో ఏడుగురు పేకాట ఆడుతూ కనిపించడంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతో పాటు వారి వద్దనుండి రూ.2,54,000 నగదు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఎక్కడైనా గాంబ్లింగ్ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు ఇంగ్లిష్ పేపర్–1 పరీక్ష నిర్వహించారు. 11,017 మంది జనరల్ విద్యార్థులకు గాను 10,543 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి చెన్న కేశవప్రసాద్ తెలిపారు. మరో 474 మంది గైర్హాజరయ్యారు. ఇక ఒకేషనల్‌కు సంబంధించి 1,676 మందికి గాను 1,541 మంది పరీక్షకు హాజరయ్యారని, మరో 135 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన వెల్లడించారు. విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ప్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.


