యాజమాన్యం ఒత్తిళ్లతోనే కార్మికుడి మృతి
చిలమత్తూరు: యాజమాన్యం ఒత్తిళ్లతోనే కార్మికుడు మృతి చెందాడని, తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం అందించాలంటూ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చిలమత్తూరు మండలం కోడూరు సమీపంలోని ముద్దప్పపల్లి వద్ద ఉన్న వేద ఇంటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు, గోరంట్ల మండలం కాగానిపల్లికి చెందిన రమేష్ గురువారం విధులకు హాజరయ్యే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో మృతుడి కుటుంబసభ్యులతో కలసి శుక్రవారం ఆ కంపెనీ ఎదుట కార్మిక సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా చాలా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. అయితే వేద ఇంటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం ఇందుకు విరుద్ధంగా కార్మికులను విధులకు హాజరు కావాలంటూ ఆదేశించిందని, దీంతో విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన రమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని వివరించారు. సమ్మె ఉన్నా పని చేయడానికి రావాలని కంపెనీ ప్రతినిధులు ఒత్తిడి చేయడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. యాజమాన్యం వైఖరి కారణంగా ఆయన భార్య, ఏడాది వయసున్న కుమారుడు అనాథలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.35 లక్షల పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించక పోవడంతో రాత్రి వరకూ ధర్నా కొనసాగింది. రాత్రి సీఐ జనార్దన్ అక్కడకు చేరుకుని కంపెనీ ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రమేష్, బాబేనాయక్, చిన్నప్పయ్య, అయూబ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, వినోద్‌కుమార్, రామచంద్ర, వెంకటేష్, సీపీఐ నాయకులు గోవిందరెడ్డి, గౌతమ్, మృతుడి బంధువులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల నాయకులు


