పురపాలికపై పచ్చ పైతనం | - | Sakshi
Sakshi News home page

పురపాలికపై పచ్చ పైతనం

Jan 30 2026 4:57 AM | Updated on Jan 30 2026 4:57 AM

పురపాలికపై పచ్చ పైతనం

పురపాలికపై పచ్చ పైతనం

ప్రపంచ ఆధ్యాత్మిక ధామం, జిల్లా కేంద్రం పుట్టపర్తిలో పరిపాలన కుంటుపడింది. దోచుకోవడమే పరమావధిగా పనిచేస్తున్న టీడీపీ నాయకులు పట్టణ పరిపాలనకు కేంద్రబిందువైన మున్సిపాలిటీలో తిష్టవేశారు. ఇష్టానుసారం దొంగ బిల్లులు తయారు చేసి ప్రజాధనం లూటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తమ మాట వినలేదన్న కారణంతో కమిషనర్‌నే వెళ్లగొట్టారు. ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టారు.

పుట్టపర్తి టౌన్‌: జిల్లా కేంద్రమైన పుట్టపర్తి పురపాలక సంఘంలో పచ్చపెత్తనం పెచ్చుమీరింది. రాష్ట్రంలో మేమే... జిల్లాలోనూ మేమే అంటూ టీడీపీ నేతలంతా రెచ్చిపోతున్నారు. అధికారులపై పెత్తనం చెలాయిస్తూ వారిని అష్టకష్టాలు పెడుతున్నారు. వీటిన్నింటినీ భరించినా అక్రమ బిల్లులకు ఆమోదం తెలపాలంటూ ఆదేశాలిస్తున్నారు. అందుకు ఒప్పుకోని అధికారులను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్‌ క్రాంతికుమార్‌కు పొమ్మనకుండానే పొగ పెట్టారు. అక్రమ బిల్లులకు ఆమోదం తెలపలేదన్న కోపంతో ఆయన్ను టార్గెట్‌ చేశారు. చివరకు అధికార పార్టీ పెద్దల ద్వారా ఒత్తిడి చేయించారు. అయితే టీడీపీ నేతలు చెప్పిన పనులు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సన్నిహితులతో వాపోయిన కమిషనర్‌...ఇక్కడ పనిచేయడం ఇష్టం లేక మెడికల్‌ లీవు పేరుతో లాంగ్‌లీవ్‌లో వెళ్లిపోయారు. దీంతో పురపాలన కుంటుపడగా...ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అక్రమ బిల్లులను

ఆమోదించాలని ఒత్తిడి..

గత నవంబర్‌లో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ చొరవతో ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని నిధులు మంజూరు చేసింది. అయితే లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి సౌకర్యాలు కల్పించేందుకు ఆ నిధులు సరిపోవని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులు ఖర్చు చేయాలని కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. అందులో భాగంగా చిత్రావతి నది పరీవాహక ప్రాంతంతోపాటు పట్టణంలో కొన్ని పనులు చేశారు. సదరు కాంట్రాక్టర్లు మున్సిపల్‌ కౌన్సిల్‌, అధికారుల అనుమతులు కూడా తీసుకోలేదు. కేవలం మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారని, డీఈ చెప్పారని నాసిరకంగా పనులు చేశారు. మరికొన్ని మాత్రం

అర్ధంతరంగా నిలిపి వేశారు. అనుమతులు లేకుండానే చేసిన పనులకు బిల్లులు చేయాలని మున్సిపల్‌ అధికారులపై టీడీపీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లు ఒత్తిడి తెచ్చారు. అలాగే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే కాంట్రాక్టర్లు, దాతలు సహకారంతో నిర్మించిన చిల్డ్రన్స్‌ పార్క్‌ పనులకూ బిల్లులు పెట్టి వాటిని ఆమోదించాలని కమిషనర్‌పై ఒత్తిడి చేశారు. అయినా కమిషనర్‌ ఒప్పుకోకపోవడంతో ‘‘బిల్లులు చేస్తావా.... వెళ్లి పోతావా’’ అంటూ బెదిరింపులకు దిగారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేని మున్సిపల్‌ కమిషనర్‌ మెడికల్‌ లీవ్‌లో వెళ్లారు. ప్రస్తుతం బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్న తెలుస్తోంది.

తాత్కాలిక మరుగుదొడ్లకు

రూ.80 లక్షల బిల్లులు..

సత్యసాయి బాబా జయంత్యుత్సవాల సమయంలో భక్తుల సౌకర్యార్థం పట్టణ పరిసర ప్రాంతాలలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.80 లక్షలకు టీడీపీ నేతలు బిల్లులు పెట్టారు. వాటిని కౌన్సిల్‌లో ఆమోదించాలని చైర్మన్‌, కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్లు కౌన్సిల్‌ మీట్‌కు గైర్హాజరయ్యారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేసి చైర్మన్‌ వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు ఎమ్మెల్యేను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉన్నట్టుండి కౌన్సిల్‌లో ప్రత్యక్షమయ్యారు. ఎక్స్‌ అఫిషియో సభ్యురాలినని, ఏం చేసినా చెల్లుతుందన్న గర్వంతో చైర్మన్‌, కోరం లేకున్నా మున్సిపల్‌ మీట్‌ కొనసాగించారు. తమ సభ్యుల ఆమోదంతో బిల్లులన్నీ పాస్‌ చేయించారు.

ఇరిగేషన్‌ స్థలంలో నిర్మించిన వాటికి బిల్లులు.. జలవనరుల శాఖ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ పుట్టపర్తిలోని టీడీపీ నాయకులు సుప్రీం ఆదేశాలను సైతం ధిక్కరించారు. జలవనరుల శాఖ స్థలంలో చిల్డ్రన్స్‌ పార్క్‌, మార్కెట్‌ యార్డ్‌, ఇతర పనుల చేశారు. ఇందుకోసం జలవనరుల శాఖ స్థలాన్ని చదును చేశారు. ఈ మూడు పనులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాలతో అధికారి పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు కేవలం నామినేషన్‌పై కట్టబెట్టారు. పనులు పూర్తి కాక ముందే జలవనరులశాఖ అధికారులు నోటీసులు ఇచ్చి పనులు అడ్డగించారు. ఆ పనులకు బిల్లులు చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ తుంగా ఓబుళపతి, కమిషనర్‌పై టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో పాటు బెదిరింపులకు దిగారు. అయినా కమిషనర్‌ వినకపోవడంతో ఆయన్ను టార్గెట్‌ చేసి ఇక్కడి నుంచి సాగనంపారు.

స్తంభించిన పురపాలన..

అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో మున్సిపల్‌ కమిషనర్‌ సెలవుపై వెళ్లడంతో కింది స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయన అత్యవసర ఫైళ్లపై తప్ప ఇతర వాటి జోలికి వెళ్లడం లేదు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో పురపాలన స్తంభించింది. అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్‌ పడింది. చివరకు జనన, మరణ ధ్రువీకరణపత్రాల మంజూరు కూడా నిలిచిపోయింది. పౌరసేవలు కూడా సకాలంలో అందకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మున్సిపాలిటీ ఆదాయ మార్గాలపై దృష్టి సారించేవారే లేకపోవడంతో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని శివారు కాలనీ వాసులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి మున్సిపాలిటీ ఆదాయం పెంచడంతోపాటు, ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ బిల్లులపై ఆమోద ముద్ర కోసం అధికారపార్టీ నేతల ఒత్తిడి

తాము చెప్పినట్లు చేయకపోతే

వెళ్లిపోవాలంటూ హుకుం

మెడికల్‌ లీవ్‌లో వెళ్లిన

పుట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌

స్తంభించిన పురపాలన...

ఇబ్బంది పడుతున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement