అంగన్‌వాడీలపై అదనపు భారం
పుట్టపర్తి అర్బన్: నిరుపేద కుటుంబాల్లోని గర్భిణులు, బాలింతలు రక్తహీనత సమస్యను అధిగమించేందుకు అవసరైన పౌష్టికాహారం తీసుకునేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం అంగన్‌వాడీలకు అదనపు భారంగా మారింది. ఇన్నాళ్లు లబ్ధిదారుల వివరాలను వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది నమోదు చేసేవారు. కానీ ఇటీవలే ఈ బాధ్యతను అంగన్‌వాడీలకు అప్పగించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన యాప్ సరిగా పనిచేయకపోవడంతో వివరాల నమోదుకు అంగన్‌వాడీ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు తమ సొంత మొబైల్ ఫోన్లలో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని మాతృత్వ వందన యోజన పథకం లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేని అటవీ ప్రాంతాల్లో అంగన్‌వాడీల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే పోషణ ట్రాకర్, బాల సంజీవని, సాసా ప్రోగ్రాం, పౌష్టికాహారం పంపిణీ సమాచారం అప్‌లోడ్ చేయడం, పీఎంఈవై తదితర యాప్‌లతో పాటు ఉన్నతాధికారులు అడిగే సమచారం ఇచ్చేందుకు సతమతమవుతున్న అంగన్‌వాడీలపై ‘మాతృ వందన’ రిజిస్ట్రేషన్ అదనపు భారంగా మారింది.
జిల్లాలో 16,167 మంది లబ్ధిదారులు..
ప్రధానమంత్రి మాతృత్వ వందన పథకం లబ్ధిదారులు జిల్లాలో 16,167 మంది ఉన్నారు. ఇందులో 8,981 మంది గర్భిణులు, 7,186 మంది బాలింతలున్నారు. వీరందరి వివరాలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు ఒక్కో ప్రసవానికి రూ. 6 వేలను మూడు విడతల్లో అందజేస్తారు. ఇందుకోసం కేంద్రం రూ.5 వేలు ఇవ్వనుండగా... ప్రసవానంతరం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 చొప్పున అందించనుంది. ఇందుకోసం అంగన్‌వాడీలు లబ్ధిదారురాలి ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, ఫోన్ నంబర్, ఫొటో, ఆరోగ్య కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతోందని, చాలాసార్లు నెట్ పని చేయక... చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తోందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇలా సర్వేలు, యాప్‌లలో వివరాల నమోదుపై దృష్టి సారిస్తే చిన్నారులకు ఎవరు చదువు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏ సర్వే చేయాలన్నా.. గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఆ బాధ్యతను అంగన్‌వాడీలపై పెడుతోందని, దీనివల్ల అంగన్‌వాడీ అసలు లక్ష్యం నెరవేరడం లేదని అంగన్ వాడీ వర్కర్ల సంఘం జిల్లా నాయకులు చెబుతున్నారు.
‘మాతృత్వ వందన’ రిజిస్ట్రేషన్
బాధ్యతలు అప్పగింత
పనిచేయని యాప్‌తో ముప్పుతిప్పలు


