రెవెన్యూ సేవల్లో వేగం పెంచండి
బత్తలపల్లి: రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలని, నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన దరఖాస్తులు... పరిష్కార స్థితి, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యలకు సంబంధించిన అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారం, దరఖాస్తుల పెండింగ్ తగ్గింపు, ప్రజలకు మరింత వేగవంతంగా సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
వేరుశనగ పంట పరిశీలన
మండలంలోని అప్పరాచెరువు గ్రామంలో వీరనారప్ప, రామకృష్ణ, నారాయణ తదితర రైతులు సాగు చేసిన వివిధ రకాల వేరుశనగ పంటలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ... విత్తన వేరుశనగ కాయలను ఎక్కడి నుంచి కొన్నారని ఆరా తీశారు. నీటి యాజమాన్యం, సాగులో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగులో రైతులకు తగిన సమయంలో సలహాలు ఇవ్వాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయాధికారి కృష్ణయ్య, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ లక్ష్మానాయక్, ధర్మవరం సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ నరసింహనాయుడు, వ్యవసాయ అధికారి ఓబిరెడ్డి, ఉద్యాన శాఖ అధికారిణి అమరేశ్వరి, ఎంఐఏఓ శివశంకర్, ఏఈఓ శ్రీనివాసులు, సర్వేయర్ స్టీఫెన్ జోసఫ్, సర్వే డిటి షణ్ముఖ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
కందుల కొనుగోలు కేంద్రం తనిఖీ
ధర్మవరం రూరల్: స్థానిక మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, కంది కొనుగోళ్ల విధానం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గింజల్లో తేమ శాతం, తూకాలను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మార్క్ ఫెడ్ సిబ్బందిని ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం


