‘హౌసింగ్’లో ‘నకిలీ’ కలకలం
● నకిలీ డిప్లొమా సర్టిఫికెట్‌తో
వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం
● జిల్లాలో 10 మంది వరకూ ఉన్నట్లు
సమాచారం
● అందులో కొందరు నకిలీ బీటెక్
పత్రాలతో ఏఈలుగా ప్రమోషన్
చిలమత్తూరు: హౌసింగ్ శాఖలో ‘నకిలీ’ అంశం కలకలం రేపుతోంది. గుర్తింపులేని విద్యా సంస్థలు ఇచ్చిన డిప్లొమా పత్రాలతో కొందరు హౌసింగ్ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా ఉద్యోగాలు పొందిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. చైన్నెకి చెందిన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్’ సంస్థ పేరిట ముద్రించిన డిప్లొమా ధ్రువీకరణ పత్రాలతో కొందరు హౌసింగ్ ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. ఇలా జిల్లాలో పది మంది దాకా వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా చేరినట్లు సమాచారం. అయితే వారు సమర్పించిన డిప్లొమా ధ్రువీకరణ పత్రం ఇచ్చిన విద్యాసంస్థకు యూజీసీ, ఏఐసీటీఈ నుంచి ఎలాంటి అనుమతి లేదని, ఆ సంస్థ పూర్తిగా నకిలీదని చైన్నె పోలీసులు తేల్చారు. అంతేకాకుండా ఆ సంస్థ తరఫున ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్న ఓ ముఠాను 2023లోనే అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు. అయినప్పటికీ అప్పటికే జిల్లాలో ఉద్యోగాలు పొందిన వారి విద్యార్హత పత్రాలను ఉన్నతాధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. దీంతో నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారంతా దర్జాగా ప్రమోషన్లు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను బీటెక్ సర్టిఫికెట్లు కూడా నకిలీవి సమర్పించినట్లు తెలుస్తోంది. హౌసింగ్ అధికారులు ఏది ఒరిజినల్... ఏది డూప్లికేట్ అని కూడా గుర్తించకుండా ఉద్యోగం ఎలా ఇచ్చారన్న దానిపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంలో లోతుగా విచారణ చేస్తే మరింత మంది నకిలీలు బయటపడే అవకాశం ఉంది.


