రాజూ.. నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు
మడకశిర రూరల్: ‘‘రాజూ...నీ స్థాయి తెలుసుకుని మాట్లాడితే మంచిది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో...ఏమేం పనులు చేసి వచ్చావో గుర్తుంచుకో. కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చావా..ఒక్క పట్టా పంపిణీ చేశావా..నువ్వు కూడా ప్రజాసేవ గురించి మాట్లాడుతుంటే జనమే నవ్వుతున్నారు. పక్షివి కాబట్టి గత ఐదేళ్లలో మడకశిరలో జరిగిన అభివృద్ధి గురించి నీకు తెలియదనుకుంట... నియోజకవర్గంలోని చిన్న పిల్లాడినడిగినా జగన్ చేసిన మేలు చెబుతారు. చంద్రబాబు వద్ద మెప్పుకోసం మరోసారి అవాకులు చెవాకులు పేలితే జాగ్రత్త’’ అంటూ వైఎస్సార్ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఎమ్మెల్యే ఎంఎస్‌రాజును హెచ్చరించారు. గురువారం ఆయన పార్టీ నేతలతో కలిసి మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పత్రికా విలేకరులపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బ్రోకర్, లోఫర్ లాంటి పదాలు తామూ మాట్లాడగలమని...కానీ తమ అధినేత అలా మాట్లాడటం తమకు నేర్పించలేదన్నారు. ఎప్పుడూ టీడీపీ పెద్దల సేవలో గడిపే ఎంఎస్ రాజు కూడా నియోజకవర్గం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండేళ్లలో ఆయన చేసిందేమీ లేదన్నారు. తాను బోర్లు వేయించానని గొప్పలు చెబుతున్న ఎంఎస్ రాజు...అవన్నీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసినవేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మండల పరిషత్ నిధులతో బోరు వేయించి...ఆయన తన సొంత డబ్బులతో వేయించినట్లు గొప్పలు చెబుతున్నారన్నారు.
మీ ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ కరువు..
చంద్రబాబు సర్కార్‌లో రక్షక భటులకే రక్షణ కరువైందని ఈరలక్కప్ప అన్నారు. ఇటీవల అగళి మండలంలోని ఓ హోటల్‌లో మద్యం విక్రయిస్తున్నట్లు తెలిసి ఎస్‌ఐ తనిఖీ చేస్తుండగా.. టీడీపీ నాయకుడి కుమార్తె ఎస్‌ఐపై దాడి చేశారని, టీడీపీ పాలనకు ఇదే ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
సమస్య పరిష్కరించడం చేతగాకే..
తాగునీటి సమస్యపై ఇటీవల బేగార్లపల్లి క్రాస్‌లో మహిళలు ఖాళీ బిందెలతో రాస్తోరోకో చేస్తే..ఆ సమస్యను పరిష్కరించడం చేతగాని ఎంఎస్ రాజు.. ఆ ఘటన గురించి రాసిన విలేకరులను దుర్భాషలాడటం దుర్మార్గమన్నారు. వెంటనే విలేకరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జలహారతి ఇచ్చింది మీ పార్టీ వారే..
వైఎస్ జగన్ చొరవతోనే మడకశిర మండలంలోని చెరువులను కృష్ణాజాలాలు నింపారని, ఆ చెరువులు మరువలు పారితే ఆనాడు టీడీపీ నాయకులే జలహారతి ఇచ్చారని ఈరలక్కప్ప గుర్తు చేశారు. తన రెండేళ్ల పదవీ కాలంలో ఎంఎస్ రాజు నియోజకవర్గంలో ఎన్ని చెరువులను కృష్ణాజలాలతో నింపారో చెప్పాలన్నారు. కొత్తగా ఒక్క ఇంటి పట్టా మంజూరు చేయని టీడీపీ ప్రభుత్వం పాత పట్టాలకు రంగులు మార్చి ఆర్భాటంగా పంపిణీ చేసిందన్నారు. ఇప్పటికై నా అబద్ధాలు చెప్పడం మాని ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. అలా కాకుండా నోరుంది కదా అని ఎవరిని పడితే వారిని దూషిస్తానంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కుంచిటిగ వక్కలిగ విభాగం అధ్యక్షుడు రంగేగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, నాయకులు హనుమంతరాయప్ప, తిమ్మారెడ్డి, నరసింహ, మల్లికార్జున, బాలకృష్ణారెడ్డి, ధను, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వలస పక్షివి కాబట్టి ఇక్కడి అభివృద్ధి నీకు తెలియదనుకుంట
మడకశిరలో ఏ ఒక్కరిని అడిగినా
జగన్ చేసిన మేలు చెబుతారు
రెండేళ్లలో మడకశిరకు
నువ్వేం చేశావో చెప్పు
ఒక్క పింఛన్ ఇచ్చావా..
ఒక్క పట్టా పంచావా..?
వైఎస్సార్ సీపీ మడకశిర
సమన్వయకర్త ఈరలక్కప్ప


