ముష్టిపల్లిలో చిరుత సంచారం
కదిరి అర్బన్: మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ ముష్టిపల్లికి వెళ్లే రహదారిలో గురువారం చిరుత కనిపించింది. క్రషర్ సమీపంలోని కొండ దిగువ ప్రాంతంలో చిరుతను చూసిన కూలీలు వెంటనే ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప... చిరుత పాద ముద్రలను గుర్తించారు. చిరుతతో పాటు దాని పిల్ల ఉన్నట్లు పాదాల గుర్తుల ద్వారా తెలుస్తోందన్నారు. సమీపంలోని కొండపై ఉంటున్న చిరుత నీటి కోసం కిందకు వచ్చి ఉంటుందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత సంచారం గురించి డీఎఫ్‌ఓకు తెలిపామని, చిరుత కనిపించిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.


