కొత్త పంటతో కళకళ
హిందూపురం: ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనే చింత పండు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గురువారం హిందూపురంలోని మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు ప్రారంభం కాగా, తొలి రోజు క్వింటా రూ.18 వేలతో విక్రయాలు సాగాయి. హిందూపురం వ్యవసాయ మార్కెట్ చింత పండు విక్రయాలకు పేరుగాంచింది. కొన్నేళ్లుగా ఇక్కడ చింతపండుకు ఆశించిన ధర లభిస్తుండటంతో ఆంధ్ర నుంచే కాక కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి రైతులు చింతపండును ఇక్కడికే తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఇందులో జిల్లాలోని మడకశిర, హిందూపురం, కదిరి నియోజకవర్గాల నుంచి సుమారు 50వేల క్వింటాళ్ల పైగా సరుకు హిందూపురానికి వస్తోంది. మరో 50 వేల క్వింటాళ్లు కర్ణాటక ప్రాంతాల నుంచి వస్తుంటుంది. ఇక్కడి నుంచి చింతపండు బెంగళూరు, చైన్నె, కొచ్చి, కొల్‌కత్తా, ముంబయి, ఢిల్లీ తదితర నగరాలకు ఎగుమతి అవుతుంది. తద్వారా మార్కెట్‌యార్డుకు కమీషన్ రూపంలో సుమారు రూ.కోటికి పైగా ఆదాయం సమకూరుతోంది. గత మూడేళ్ల క్రయవిక్రయాలను పరిశీలిస్తే ఈసారి ఈ ప్రాంతంలో పంట ఎక్కువగా కనిపిస్తోంది.
రెండేళ్లుగా నిరాశ ..
గత రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో చింత పండుకు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనే అశించిన ధర దక్కడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మార్కెట్ ఆరంభమైన తొలిరోజు గురువారం 10 వేల క్వింటాళ్లకు పైగా చింతపండు మార్కెట్‌కు వచ్చింది. ఎవరి గోదాము వద్ద వారే బహిరంగంగా వేలం పాడి రైతుల దిగుబడులు కొనుగోళ్లు చేశారు. మొదటిరకం కరీపులీ రకం క్వింటా ఏకంగా రూ.18 వేలు నుంచి రూ.20వేల వరకు అమ్ముడు పోయింది.
గత ఏడాదిఽ ధర లేక..
గత రెండేళ్లుగా మార్కెట్‌లో చింత పండుకు సరైన ధరలు లేవు. దీంతో వ్యాపారులు హిందూపురం, పరిగి, మడకశిర ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో 90 వేల క్వింటాళ్ల కరిపులి, ఫ్లవర్, బోటు రకాలకు చెందిన చింత పండు నిల్వలను అలాగే ఉంచారు. గత ఏడాది నవంబర్ నుంచే ధర కాస్త పెరగడంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపు 100 లారీల సరుకును పలు నగరాలకు ఎగుమతి చేశారు. ఇంకా 50 వేల క్వింటాళ్ల వరకు సరుకు స్టోరేజిల్లో ఉన్నట్లు సమాచారం.
చింతపండు క్రయవిక్రయాలు ప్రారంభం
స్థానిక మార్కెట్ యార్డులో ఈ ఏడాది సీజన్‌లో చింతపండు క్రయవిక్రయాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్ కమిటీ కార్యదర్శి నరసింహమూర్తి ఆధ్వర్యంలో యార్డు చైర్మన్ అశ్వత్థరెడ్డి పూజలు నిర్వహించి మొదటిరోజు విక్రయాలు ప్రారంభించారు.అనంతరం రైతులకు అన్నదానం నిర్వహించారు.
కొత్త పంట
ఈ రోజునే వచ్చింది
మార్కెట్‌కు కొత్తపంట మొదటి రోజు వచ్చింది. ఈ సారి చింత పండు దిగుబడి బాగుంది. ధర కూడా అదే స్థాయిలో ఉంటోంది. సీజన్ ప్రారంభంలోనే క్వింటా రూ.18 వేలకు పైగా అమ్ముడు పోవడం మంచి పరిణామం. రాబోవురోజుల్లో క్రయవిక్రయాలు జోరుగానే ఉంటాయి. – నరసింహమూర్తి,
మార్కెట్ కార్యదర్శి, హిందూపురం.
కొత్త చింతపండు రాకతో
పెరిగిన డిమాండ్
మార్కెట్ ప్రారంభం రోజునే క్వింటా రూ.18 వేలు పలికిన వైనం


