బోరు నీటి కోసమే హత్య
మడకశిర: ఈ నెల 25న మడకశిర మండలం బి.రాయాపురం గ్రామంలో చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం బోరు నీటి కోసమే తన దాయాదిని హతమార్చినట్లుగా అంగీకరించిన నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మడకశిర అప్‌గ్రేడ్ పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ నర్శింగప్ప వెల్లడించారు. బి.రాయాపురం గ్రామానికి చెందిన ఈరేగౌడ్, రాధాకృష్ణ దాయాదులు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దాయాదులిద్దరూ కలసి పదేళ్ల క్రితం ఓ బారుబావిని తవ్వించారు. రాధాకృష్ణకు చెందిన పొలంతో తవ్విన ఈ బోరు బావికి ఇద్దరూ కలసి రూ. లక్ష వరకు ఖర్చు చేశారు. అనంతరం పంటల సాగుకు నీటిని పెట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. తరచూ బోరుబావి నీటి విషయంలో ఇద్దరూ ఘర్షణ పడే వారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ నిర్వహించారు. పెద్దల తీర్మానం మేరకు ఈరేగౌడ్‌కు రూ.50వేలు చెల్లించి బోరుబావిని రాధాకృష్ణ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత బోరుబావి నీటిని రాధాకృష్ణ ఒక్కడే పంటలకు ఉపయోగించుకుంటూ మిగులు నీటిని ఇతర రైతులకు వదిలేవాడు. ఈ క్రమంలో తాను సాగు చేసిన పంటకు నీరు అందక ఈరేగౌడ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి వ్యసనాలకు బానిసయ్యాడు. ఎంబీబీఎస్ చదువుతున్న కుమారుడి ఫీజులు సైతం చెల్లించలేని స్థితిలో సతమతమవుతూ దీనికంతటికీ కారణం రాధాకృష్ణనే అని భావించి కక్ష పెంచుకున్నాడు. బోరుబావికి సంబంధించిన డబ్బు ఇవాలని పలుమార్లు రాధాకృష్ణను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అయినా రాధాకృష్ణ డబ్బు ఇవ్వకపోవడంతో పథకం ప్రకారం ఈ నెల 25న హరేసముద్రం గ్రామానికి వెళ్లి ఓ పదునైన వేటకొడవలిని కొనుగోలు చేశాడు. అదే రోజు రాధాకృష్ణ ఇంటికి వెళ్లాడు. అక్కడ రాధాకృష్ణ లేకపోవడంతో ఆయన భార్యను బెదిరించాడు. బోరుబావిని అప్పగించాలని, లేకపోతే డబ్బైనా ఇవ్వాలన్నాడు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి కాదన్నా రాధాకృష్ణను చంపేస్తానంటూ అక్కడి నుంచి వెళ్లి నేరుగా పొలానికి చేరుకున్నాడు. ఒంటరిగా పొలం పనిలో నిమగ్నమైన రాధాకృష్ణపై వేటకొడవలితో దాడి చేసి హతమార్చి ఉడాయించాడు. ఘటనపై హతుడి భార్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐలు రాజ్‌కుమార్, సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ లావణ్య పక్కా ఆధారాలతో గురువారం గొల్లపల్లి క్రాస్ వద్ద నిందితుడు ఈరేగౌడ్‌ను అరెస్ట్ చేసి, వేటకొడవలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
దాయాది హత్య కేసులో వీడిన మిస్టరీ
నిందితుడి అరెస్ట్


