లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్
ప్రశాంతి నిలయం: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ (డీఎల్‌ఎంసీ) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడా పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ను అతిక్రమించరాదని, స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాక్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిసెప్షన్, స్కాన్ రూం ముందర ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లను అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం, విశ్రాంత మెడికల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీఐఓ డాక్టర్ సురేష్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సునీల్, అధికారులు పాల్గొన్నారు.
బాల మేధావికి కలెక్టర్ అభినందన
హిందూపురం టౌన్: హిందూపురం పట్టణానికి చెందిన నాట్యాచార్యులు చంద్రభాను చతుర్వేది, చంద్రమోహన్ దంపతుల 11 నెలల కుమారుడు ఆవిర్భవ్ అద్వైత్‌ను కలెక్టర్ శ్యాంప్రసాద్ అభినందించారు. సరిగ్గా నోరు కూడా తిరగని చిన్నారి ఏకంగా ఏడు జాతీయ అవార్డులను కై వసం చేసుకున్నాడు. జాతీయ నాయకుల పేర్లు, పక్షులు, ప్రపంచ చిత్రపటంలోని వివిధ దేశాలను గుర్తిస్తూ అందరినీ అబ్బురపరుస్తూ ప్రముఖుల ప్రశంసలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల అవార్డులను సొంతం చేసుకున్నాడు. ద గ్లోబల్ ఇంటర్నేషనల్ అచీవ్ మెంట్ అవార్డు, ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు, ఇంటర్నేషనల్ అచీవ్ మెంట్ అవార్డు, భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, భారత్ గౌరవ అవార్డు, సుభాష్ చంద్రబోస్ నేషనల్ అవార్డ్, డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ రత్న వంటి ఏడు జాతీయ అవార్డులను కై వసం చేసుకున్నాడు. తాజాగా ఇటీవల పుట్టపర్తిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ చిన్నారి తన అసాధారణ ప్రతిభతో కలెక్టర్‌నూ ఆకట్టుకున్నాడు.
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం
● సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్
లేపాక్షి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ విమర్శించారు. బుధవారం లేపాక్షిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో హిందూపురం నియోజకవర్గ సీపీఐ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకువస్తే... వాటిని నిర్వహించలేక చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధపడడం సిగ్గు చేటన్నారు. 10 మెడికల్ కలాశాలలు పూర్తి అయి అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించిన అనంతరం ప్రైవేటు వారికి అప్పగించి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా నీటిని తన సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించుకెళ్లండంపై సీఎం చంద్రబాబుకు ఉన్న ఆసక్తి.. మిగిలిన రాయలసీమ జిల్లాలకు నీరు ఇవ్వడం లేకుండా పోయిందన్నారు. ఈ అంశంపై జిల్లా ప్రజాప్రతినిదులు, మేధావులు కూడా ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. కియా లాంటి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదని, ఒకవేళ ఉద్యోగం ఇచ్చిన కాపీ, టీ, స్వీపరు లాంటి ఉద్యోగాలు ఇస్తున్నారని, స్థానికంగా నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేసారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో బలవంతపు భూ సేకరణ ఆపాలని, 2013 చట్టం అనుసరించి రైతులకు ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించాలన్నారు. ఉపాధి హామీ చట్టం పేర్పు మార్పు తగదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 30న సామూహిక దీక్షలు, ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో హిందూపురం, లేపాక్షి మండలాల సీపీఐ కార్యదర్శులు వినోద్‌కుమార్, గౌతమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దాదాపీర్, నాయకులు శివప్ప, బాబు, మారుతీరెడ్డి, రవికుమార్, షాబీరా, సురేష్, చలపతి, శ్రీనివాసులు, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్
లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్


