ఉపాధ్యాయుడిపై చీటింగ్ కేసు
ధర్మవరం రూరల్: నమ్మకంతో చీటీ కడితే డబ్బు ఇవ్వకుండా కుటుంబసభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఉపాధ్యాయుడు పసల కృష్ణమూర్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వారు వెల్లడించారు. ధర్మవరంలోని మారుతీనగర్‌కు చెందిన గట్టు రామాంజనేయులు అనంతపురంలోని బాలుర ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన పసల కృష్ణమూర్తి కూడా టీచర్‌గా పనిచేస్తుండడంతో అతని వద్ద రామాంజనేయులు రూ.10 లక్షల చీటీకి ప్రతి నెలా రూ.26 వేలు, రూ.2 లక్షల చీటీకి ప్రతి నెలా రూ.10 వేలు చొప్పున కడుతూ వచ్చాడు. రూ.10 లక్షల చీటీకి 30 కంతులు, రూ. 2లక్షల చీటీకి 17 కంతుల చెల్లించిన అనంతరం చీటీ పూర్తయింది. ఈ క్రమంలో డబ్బులు చెల్లించకుండా కృష్ణమూర్తి ముఖం చాటేయడంతో ఆరా తీసేందుకు బుధవారం ఆయన ఇంటి వద్దకెళ్లాడు. ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుసుకున్న బాదితుడు రామాంజనేయులు ఫిర్యాదు మేరకు కృష్ణమూర్తిపై చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
దశలవారీ పోరాటాలకు సిద్ధంకండి
●ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌నాయక్
హిందూపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో తలపెట్టిన దశలవారీ పోరాటాలను విజయవంతం చేయాలంటూ ఆ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ పిలుపునిచ్చారు. హిందూపురంలోని అజీజియా మున్సిపల్ ఉర్దూ ఉన్నత ఆపటశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు సామ్రాజ్యం, నాయకుల చేతుల మీదుగా ఎస్టీయూ దశల వారీ ఉద్యమ కార్యాచరణ కరపత్రాలను బుధవారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ నెల 30న అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించడం, ఫిబ్రవరి 10న కలెక్టరేట్ వద్ద ధర్నా, ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ యూనియన్ అధ్యక్షుడు సమీవుల్లా, జిల్లా కార్యదర్శి జబీవుల్లా, మునిసిపల్ ఉపాధ్యక్షుడు రాయల్ హరి, తిరుపతయ్య, ఇమ్రాన్, ఆకిఫా తస్లీమ్, హసీనా, సుమతి, షాహిదా, నస్రత్, అతియా తదితరులు పాల్గొన్నారు.


