నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి : సీపీఎం
కదిరి టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరంకుశ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. కదిరిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం సీపీఎం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వి.రాంభూపాల్ హజరై, మాట్లాడారు. వీ–బీ–జీ రాంజీ, విద్యుత్ చట్టాల సవరణ, లేబర్ కోడ్, సీడ్ బిల్లు, మినీ అణు విద్యుత్ ప్లాంట్ల వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఒనగూరే లాభాలు, ప్రజలపై పడే భారాలను వివరించారు. నిరంకుశ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 30న గ్రామాల్లో ప్రతిజ్ఞలు, సంతకాల సేకరణ, ఫిబ్రవరి 2న సచివాలయాల్లో వినతి పత్రాల అందజేత, ఫిబ్రవరి 5న అన్ని మండలాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జెడ్పీ శ్రీనివాసులు, జీఎల్ నరసింహులు, హరి, జంగాలపల్లి పెద్దన్న, లక్ష్మీనారాయణ, దిల్షాద్, ప్రవీణ్‌కుమార్, జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.


