ఖాద్రీశా.. జగదీశ అంటూ భక్తులు కీర్తించగా...కదిరి లక్ష్మ
● శ్రీవారి దర్శనంతో పునీతులైన భక్తులు
● నారసింహ నామంతో ప్రతిధ్వనించిన కదిరి
● ఘనంగా ఖాద్రీశుని పులి పార్వేట ఉత్సవం
● కుందేలును పట్టుకోవడానికి ఎగబడ్డ భక్తజనం
ఖాద్రీశుడి పార్వేట ఉత్సవానికి హాజరైన భక్త జనసందోహం
కదిరి అర్బన్: సంక్రాంతిని పురస్కరించుకుని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి పులి పార్వేట ఉత్సవం శుక్రవారం భక్తుల కోలాహలం మధ్య కనుల పండువగా జరిగింది. ఏటా మకర సంక్రాంతి మరుసటి దినం, కనుమ రోజున పులి పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆయుధం ధరించి వన విహారానికి వెళ్లేవారని దృష్ట, భయంకర మృగాలను వేటాడి విజయ గర్వంతో తిరిగి వస్తారని అందుకే పార్వేట ఉత్సవం నిర్వహిస్తారని భక్తుల నమ్మకం.
ఆలయంలో ప్రత్యేక పూజలు..
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆలయంలో శ్రీవారికి నిత్యపూజలు, నివేదనలు జరిగాయి. ఉదయం 9 గంటల అనంతరం స్వామి వారు పార్వేట ఉత్సవం కోసం కదిరి కొండకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారికి పూజ, నివేదన, ప్రసాద వినియోగాలు జరిగాయి.
పాల పొంగుల ఉత్సవం..
శ్రీవారు కదిరి కొండ నుంచి కుమ్మరవాండ్లపల్లిలోని పాల పొంగిలి మంటపం చేరి పూజలు అందుకున్నారు. అక్కడ స్వామి కాపులైన గొల్లవారు మట్టికుండల్లో పాలు పొంగించి ఆ పాలను శ్రీ వారికి నైవేద్యంగా సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారిని పల్లకీలో కొలువుదీర్చి పార్వేట మంటపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పార్వేట విశిష్టతను తెలియజేశారు.
ఆకట్టుకున్న పార్వేట ఉత్సవం..
పాల పొంగుల ఉత్సవం ముగిశాక ఖాద్రీశుడు రైల్వేస్టేషన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ మధ్యలో ఉన్న పార్వేట మంటపానికి చేరుకున్నారు. అప్పటికే అశేష భక్తజనాల కోలాహలంతో ఆ ప్రాంతం గోవిందనామస్మరణతో మార్మోగిపోయింది. ఎప్పటిలాగే ఆచారం ప్రకారం కుందేళ్లను జనం మధ్యకు వదిలారు. కుందేళ్లను పట్టుకోవడానికి భక్తజనం పోటీ పడ్డారు. కొందరు భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. పూర్వం కుందేలు స్థానంలో పులిని వదిలేవారని భక్తులు చెపుతున్నారు. పార్వేట ఉత్సవం ముగిశాక స్వామివారు రాయచోటి రోడ్డులోని ఉట్టివద్ద శమీమంటపం చేరి పూజలు అందుకున్నారు.
అశ్వవాహనంపై ఖాద్రీశుడు..
శమీమంటపం వద్ద పూజలు అందుకున్న అనంతరం శ్రీవారు ప్రత్యేక అలంకరణతో అశ్వవాహనంపై పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం తిరిగి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద చోరసంవాదం నిర్వహించాక స్వామివారు తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో పార్వేట ఉత్సవం ముగిసింది.
పార్వేటకు హాజరైన అశేషభక్తజనం..
పులి పార్వేట ఉత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. ఉదయం స్వామి వారిని దర్శించుకుని పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పార్వేట ఉత్సవాన్ని తిలకించారు. డీఎస్పీ శివనారాయణస్వామి, పట్టణ, రూరల్ సీఐలు నారాయణరెడ్డి, నిరంజన్‌రెడ్డి పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
ఖాద్రీశా.. జగదీశ అంటూ భక్తులు కీర్తించగా...కదిరి లక్ష్మ
ఖాద్రీశా.. జగదీశ అంటూ భక్తులు కీర్తించగా...కదిరి లక్ష్మ
ఖాద్రీశా.. జగదీశ అంటూ భక్తులు కీర్తించగా...కదిరి లక్ష్మ
ఖాద్రీశా.. జగదీశ అంటూ భక్తులు కీర్తించగా...కదిరి లక్ష్మ


