పుట్టపర్తికి పాదయాత్ర
న్యూస్‌రీల్
రొద్దం: ఉత్తర కర్ణాటక నుంచి సత్యసాయి సన్నిధికి పాదయాత్ర చేస్తున్న భక్తుల బృందం గురువారం రొద్దం మండల కేంద్రానికి చేరుకుంది. శుక్రవారం పాదయాత్ర బృందం స్థానిక భజన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టపర్తి సత్యసాయి సన్నిధికి బయలుదేరి వెళ్లారు. ఉత్తర కర్ణాటక నుంచి 500 కిలో మీటర్లు పాదయాత్రగా వచ్చినట్లు వివరించారు. రొద్దం సత్యసాయి సేవా సమితి సభ్యులు వారికి స్వాగతం పలికారు. భక్తులకు ఉదయం అల్పహారం ఏర్పాటు చేశారు.
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయసేకరణ
అనంతపురం టౌన్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఆ శాఖ అనంతపురం జిల్లా ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈ నెల 20న తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో, 22, 23వ తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, 27న కర్నూలులోని ఏపీ ఈఆర్‌సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల నుంచి ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి 4.30 గంటల వరకు అర్జీలను స్వీకరిస్తారన్నారు.
పుట్టపర్తికి పాదయాత్ర


