పట్టు రైతుకు ఊరట
మడకశిర: పట్టు పరిశ్రమకు రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రసిద్ధి. జిల్లాలో ఉత్పత్తయ్యే పట్టుగూళ్లకు నాణ్యతకు పెట్టింది పేరు. అందుకే దేశవిదేశాలకు ఎగుమతి అవుతాయి. కానీ పట్టు రైతులకు ప్రోత్సహకాలు అందించి ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ధరలు నిలకడగా ఉండడంతో పట్టు రైతులు గట్టెక్కడానికి అవకాశం ఏర్పడింది.
కేజీ బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.800పైనే..
పట్టుగూళ్ల ధరలు ఏడాదిన్నర నుంచి నిలకడగా కొనసాగుతున్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక మార్కెట్‌లలో కూడా పట్టుగూళ్ల ధరలు ఆశించిన మేర ఉండటంతో రైతులు గట్టెక్కుతున్నారు. ఏడాదిన్నర క్రితం బైవోల్టిన్ పట్టు గూళ్లఽ కేజీ గరిష్టంగా రూ.600లోపే పలికేవి. ప్రస్తుతం కేజీ రూ.800పైనే పలుకుతుండటంతో రైతులకు ఊరట లభిస్తోంది. ఈనెల 10న హిందూపురం మార్కెట్‌లో కేజీ బైవోల్టిన్ పట్టుగూళ్లు రూ.915 పలకడం విశేషం. ప్రస్తుతం రోజూ కిలో బైవోల్టిన్ పట్టుగూళ్లు రూ.800పైనే పలుకుతుండటంతో పట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఆదుకుంటున్న రామనగర్ మార్కెట్..
కర్ణాటక రాష్ట్రం రామనగర్ పట్టుగూళ్ల మార్కెట్ దేశంలోనే ప్రసిద్ధి. ఈ మార్కెట్ జిల్లా సరిహద్దులోనే ఉంటుంది. హిందూపురం మార్కెట్‌తో పోలిస్తే ఈ మార్కెట్‌లో పట్టుగూళ్లకు కొంత అధిక ధర దక్కుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మడకశిర, పెనుకొండ, హిందూపురం, కదిరి తదితర ప్రాంతాల పట్టు రైతులు బైవోల్టిన్ పట్టు గూళ్లను రామనగర్ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. రామనగర్ మార్కెట్‌లో పట్టుగూళ్ల ధరలు రూ.850 నుంచి రూ.900పైనే పలుకుతుండటంతో జిల్లాలోని పట్టు రైతులకు ఊరటనిస్తోంది.
ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం..
పట్టు రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కానీ పట్టుగూళ్ల ధరలు నిలకడగా ఉండడంతో రైతులు గట్టెక్కారు. ప్రధానంగా ప్రభుత్వ మార్కెట్‌లో అమ్మిన ప్రతి కేజీ బైవోల్టిన్ పట్టుగూళ్లకు ప్రోత్సాహకం కింద ప్రభుత్వం రూ.50 అందించాలి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రోత్సాహకం పట్టు రైతులకు చెల్లించడం లేదు. ప్రోత్సాహకం బకాయిలు దాదాపు రూ.65 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రోత్సాహక నిధులు మంజూరు చేసి పట్టు రైతులను ఆదుకోవాలని పట్టు రైతుల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పలుసార్లు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులను కోరినా ఇంత వరకు కనికరించలేదు. దీంతో ఈ ప్రోత్సాహకం వస్తుందో లేదోననే ఆందోళన పట్టు రైతుల్లో వ్యక్తమవుతోంది.
ధరల నిలకడతోనే గట్టెక్కాం
పట్టుగూళ్ల ధరలు ఏడాదిన్నర నుంచి నిలకడగా ఉన్నాయి. అందువల్లే రైతులు గట్టెక్కారు. లేకపోతే పట్టు పరిశ్రమ ప్రమాదంలో పడేది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలి. వెంటనే ప్రోత్సాహకం బకాయిలను మంజూరు చేయాలి. – సోమ్ కుమార్,
పట్టు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు
మార్కెట్‌లో నిలకడగా
పట్టుగూళ్ల ధరలు
ఏడాదిన్నర నుంచి ఆశించిన మేర
పలికిన వైనం
ఈనెల 10న రూ.915 పలికిన
కేజీ బైవోల్టిన్ పట్టుగూళ్లు
ప్రస్తుతం కేజీ రూ.800పైనే
పలుకుతుండడంతో రైతుల్లో హర్షం
పట్టు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా
విస్మరించిన చంద్రబాబు
‘ప్రోత్సాహకం’ నిధులు నేటికీ
విడుదల చేయని సర్కార్
మార్కెట్ మద్దతు ఇవ్వడంతో పట్టురైతులు గట్టెక్కారు. ఏడాది క్రితం ధర హెచ్చుతగ్గులతో తీవ్రంగా నష్టపోయిన పట్టు రైతులు తాజాగా ధరలు నిలకడగా కొనసాగుతుండటంతో
కాస్త ఊరట చెందారు. కిలో బైవోల్టిన్ రూ.800 తగ్గకుండా పలుకుతుండటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పట్టురైతులకు అండగా నిలవాల్సిన చంద్రబాబు సర్కార్ మాత్రం కనీసం ‘ప్రోత్సాహకం’ నిధులు కూడా మంజూరు చేయకుండా చోద్యం చూస్తోంది.
పట్టు రైతుకు ఊరట
పట్టు రైతుకు ఊరట


