గ్రీన్ ఫీల్డ్ హైవే ఘనత జగన్‌దే
పుట్టపర్తి: రహదారులు దేశ నాగరికతకు అద్దం పడతాయన్న సిద్దాంతాన్ని నమ్మి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019–2024 మధ్య కాలంలో రాష్ట్రంలో అనేక జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టారని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగానే బెంగళూరు–విజయవాడ గ్రీన్ ఫీల్డు హైవే–544జీ (ఆరు వరుసల రహదారి)కి 2022లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించి 2023 డిసెంబర్‌లో పనులు ప్రారంభించారన్నారు. ఈ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతోందన్నారు. ఎన్‌హెచ్ 544–జీ పనులు చేపట్టిన రాజ్‌పత్ ఇన్‌ఫ్రా కాన్ సంస్థ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న నేపథ్యంలో దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం పుట్టపర్తి మండలం సాతర్లపల్లి, నల్లమాడ మండలం రెడ్డిపల్లి, వంకరకుంట వరకు రోడ్డు మార్గాన పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల్లోనే 56 కిలోమీటర్ల మేర తారురోడ్డు వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కెక్కటంతో నిర్మాణ సంస్థ రాజ్ పత్ ఇన్‌ఫ్రా కాన్‌ను అభినందిస్తున్నట్లు శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
జగన్, మోదీ చొరవతోనే...
2022 సెప్టెంబర్ 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, అప్పటి సీఎం జగన్ ప్రత్యేక చొరవతో బెంగళూరు–విజయవాడ గ్రీన్ ఫీల్డు హైవే–544జీ నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 336 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం రూ.18 వేల కోట్లు మంజూరైందన్నారు. జిల్లాలోని కొడికొండ వద్ద ప్రారంభమయ్యే 544–జీ జాతీయ రహదారి పుట్టపర్తి మండలం, నల్లమాడ మండలాల గుండా కడప, ఒంగోలు జిల్లా మేదరమెట్ల వరకు ఏర్పాటవుతోందన్నారు. ఎన్‌హెచ్– 544జీ గ్రీన్ ఫీల్డు హైవే మంజూరులో తాను భాగస్వామి కావటం సంతోషంగా ఉందన్నారు. అప్పటి సీఎం జగన్‌ను తాను ప్రత్యేకంగా కలిసి ఈ రహదారి ఏర్పాటుపై చర్చించానన్నారు. 2014–2019 మధ్య కాలంలోనూ, ప్రస్తుత పాలనలోనూ సీఎం చంద్రబాబు జిల్లాకు చేసిందేమీ లేదని శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం సత్యసాయి జిల్లాలో ఏ ఒక్క శాశ్వతమైన పని చేపట్టలేదని విమర్శించారు.
రవాణా రంగం పరుగు తీస్తుంది..
ఎన్‌హెచ్– 544జీ రహదారి పూర్తయితే విజయవాడ – బెంగళూరు మధ్య ప్రయాణ దూరం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుందని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అలాగే ఈరెండు నగరాల మధ్య రవాణా రంగం పెద్ద ఎత్తున పరుగులు పెడుతుందన్నారు. అలాగే జిల్లా రైతులు పండించిన పంటలను పలు ప్రాంతాలకు త్వరితగతిన రవాణా చేసుకునేందుకు వీలుంటుందన్నారు. అలాగే తమ హయాంలోనే మంజూరైన జాతీయరహదారి –342 పనులు కోడూరు తోపు నుంచి గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల మీదుగా ముదిగుబ్బ వరకు 80 కిలో మీటర్ల మేర జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు నుంచి గోరంట్ల వరకు ఎన్‌హెచ్ – 716జీ మంజూరు చేశామన్నారు. ఇవన్నీ వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ సహకారంతో మంజూరు చేసినవేనని శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
2022లోనే ఆరు లేన్ల ఎన్‌హెచ్ 544–జీ నిర్మాణానికి గెజిట్
నిర్మాణంలో గిన్నిస్ రికార్డు సాధించిన రాజ్‌పత్ ఇన్‌ఫ్రా కాన్‌కు అభినందనలు
మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి


