చార్జింగ్‌ స్టేషన్ల బాధ్యత మున్సిపాలిటీలదే | - | Sakshi
Sakshi News home page

చార్జింగ్‌ స్టేషన్ల బాధ్యత మున్సిపాలిటీలదే

Jan 11 2026 9:45 AM | Updated on Jan 11 2026 9:45 AM

చార్జింగ్‌ స్టేషన్ల బాధ్యత మున్సిపాలిటీలదే

చార్జింగ్‌ స్టేషన్ల బాధ్యత మున్సిపాలిటీలదే

మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ కోసం ఈ–ఆటోల టెండర్‌ ప్రక్రియలో సర్కారు

వింతాట ఆడింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 1,910 ఈ–ఆటోల సరఫరా, నిర్వహణకు నాలుగు కంపెనీలకు ఒకే ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఒక్కో వాహనానికి నెలకు రూ.68,949 చొప్పున చెల్లిస్తూ ఐదేళ్ల కాలపరిమితితో రూ.790 కోట్లకు పైగా వ్యయం అయ్యే ఒప్పందంపై విస్తృత చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో వాహనానికి రూ.64 వేలలోపు మాత్రమే అద్దె చెల్లించేవారు. మనుషులనూ సదరు కంపెనీలే ఏర్పాటు చేసుకునేవి. పైగా అవి డీజిల్‌ వాహనాలు. ప్రస్తుతం ఈ–వాహనాలు కావడంతో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు స్థలం కూడా నగర పాలక సంస్థలే చూపించాలి. కంపెనీలు కోట్‌ చేసిన ఒకే రేటు చూస్తుంటే టెండర్‌ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనంతపురం క్రైం: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో ఇంటింటి చెత్త సేకరణ కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ – అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ఆధ్వర్యంలో చెత్త తరలింపు వాహనాల (ఫోర్‌ వీలర్‌ ఈ–ఆటోలు) సరఫరా, నిర్వహణ టెండర్‌కు సంబంధించి గత ఏడాది నవంబరు 12న ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టెండర్‌ కమిటీ పరిశీలన అనంతరం డిసెంబరు 11న ఆమోదం తెలపగా, 12న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ ఎంప్యానల్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఈ టెండర్‌ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,10,000 గృహాలు, వాణిజ్య సంస్థల నుంచి చెత్త సేకరణ చేయడానికి 1,910 ఈ–ఆటో వాహనాలు అవసరమని అంచనా వేశారు. అదనంగా రెండు శాతం స్టాండ్‌బై వాహనాలు కూడా ఉండాలని షరతు విధించారు. ఒక్కో ఈ–ఆటో రోజుకు కనీసం వెయ్యి ఇళ్ల నుంచి చెత్త సేకరణ, రోజుకు కనీసం 45 కిలోమీటర్లు, ఏడు గంటల ఆపరేషన్‌ తప్పనిసరిగా చేయాలన్న నిబంధన పెట్టారు. వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌ మాత్రమే ఉండాలి. ఒక్క ఈ–ఆటోకు నెలకు చెల్లించాల్సిన కనీస ఎల్‌ వన్‌ రేటును రూ.68,949 (జీఎస్టీతో సహా)గా నిర్ణయించారు. ఈ లెక్కన ఒక్క వాహనానికి ఏడాదికి సుమారు రూ.8.27 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తం 1,910 వాహనాలకు ఏడాదికి రూ.158 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఐదేళ్ల ఒప్పంద కాలానికి ఈ మొత్తం రూ.790 కోట్లకు మించి ఉంటుందని అంచనా వేశారు. దీనికి అదనంగా ప్రతి ఏడాది 5 శాతం ధర పెంపు (ఎస్కలేషన్‌)ను కూడా ఒప్పందంలో చేర్చారు. టెండర్లలో క్యూబ్‌ బయో ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హిమాలయన్‌ ఇన్‌ఫ్రాకార్ప్‌, ఐవే అసోసియేట్స్‌తో జాయింట్‌ వెంచర్‌), గణేష్‌ శంకర్‌ ఎన్విరాన్‌న్‌మెంటల్‌ సొల్యూషన్‌న్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హాస్పర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో జేవీ), లయన్స్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ సర్వీసెస్‌ (ఉత్తరప్రదేశ్‌), సాయి పావని కన్‌స్ట్రక్షన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆంధ్రప్రదేశ్‌) కంపెనీలు పోటీ పడ్డాయి. ఇందులో గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ నాలుగు కంపెనీలూ క్యూబ్‌ బయో ఎనర్జీ కోట్‌ చేసిన ఎల్‌వన్‌ రేటు రూ.68,949కే అంగీకరించాయి. అంటే ధర విషయంలో పోటీ లేకుండా ఒకే రేటుకు ఒప్పందాలు జరిగాయి. అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు ఎంప్యానెల్‌ చేసిన ఈ కంపెనీలతో మాత్రమే ఒప్పందాలు చేసుకోవాలి. ఇతర ఏజెన్సీలను నియమించే అవకాశం లేదు. వాహనాల కొనుగోలు, బ్యాంకు రుణాలు, డ్రైవర్లు, వాహనాల మెయింటెనెన్స్‌, రిపేర్లు, జీపీఎస్‌, సీసీ కెమెరాలు, జీఐఎస్‌ ఆధారిత మానిటరింగ్‌ సిస్టమ్స్‌ బాధ్యత కంపెనీలదే.

ఈ–ఆటోల ద్వారా చెత్త సేకరణ టెండర్లలో సర్కారు వింతాట

రూ.790 కోట్లు..

నాలుగు కంపెనీలు

ఒకే ధరతో నాలుగు

కంపెనీలతో ఒప్పందాలు

మున్సిపాలిటీలపై

తీవ్ర ఆర్థిక భారం

ఈ–ఆటోల చార్జింగ్‌ స్టేషన్ల కోసం అవసరమైన భూమి, విద్యుత్‌ కనెక్షన్‌, ట్రాన్స్‌ఫార్మర్లను మున్సిపాలిటీలే ఏర్పాటు చేయాలి. నెలనెలా బిల్లులు మున్సిపల్‌ నిధుల నుంచే చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా వాహనాల కేటాయింపులో విజయవాడకు 158 ఈ–ఆటోలు, విశాఖపట్నంకు 96, గుంటూరుకు 200, నెల్లూరుకు 200, కర్నూలుకు 91, అనంతపురం నగరానికి 62, గుంతకల్లుకు 20, రాయదుర్గానికి 9, గుత్తికి 5, కళ్యాణదుర్గానికి 7.. ఇలా ప్రతి మున్సిపాలిటీకి గృహాల సంఖ్య ఆధారంగా కేటాయించారు. వీటిని 2026 జనవరి 31లోపు సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ వ్యవస్థను దీర్ఘకాలం పాటు ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించడం, ఒకే రేటుకు అన్ని కంపెనీలు ఒప్పుకోవడం, వ్యయం వందల కోట్లకు చేరడం, మున్సిపాలిటీలపై దీర్ఘకాలిక ఆర్థిక భారం పడటం వంటి అంశాలు ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement