తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టం
ధర్మవరం రూరల్: తప్పు చేసే వారు ఎవరైనా...ఎంతటి వారైనా వదిలేది లేదని ఎస్పీ సతీష్‌కుమార్ తేల్చి చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తప్పక కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. నేరాల్లో ముద్దాయిలుగా తేలిన వారి ఆస్తులను సైతం కోర్టులకు అటాచ్ చేస్తామని హెచ్చరించారు. శనివారం ఉదయం ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 120 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ నాయకులకు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో నడుచుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఘర్షణలకు దిగుతూ గ్రామంలో అశాంతి కారణమయ్యే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు. పదేపదే నేరాలకు పాల్పడితే నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామన్నారు. అంతేకాకుండా వారి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా... ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుంచి మంజూరు చేయబోమన్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. అందువల్ల గొడవలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు, రికార్డులు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ హేమంత్ కుమార్, సీఐలు ప్రభాకర్, శ్రీధర్, ఆర్‌ఐ రవికుమార్, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు.
ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరిక


