తండాలకు కరెంటు కట్
కదిరి అర్బన్: సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చే వారితో పల్లెలన్నీ కళకళలాడుతుంటే గిరిజనులు ఉండే తండాల్లో చంద్రబాబు సర్కార్ అంధకారం నింపింది. కేవలం కనెక్షన్ తీసుకోలేదన్న కారణంతో మండల పరిధిలోని చిగురుమానుతండా, నల్లగుట్టతండా, చవిటితండాలకు శనివారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. మీటర్లు బిగించుకుంటేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారని చిగురుమానుతండా సర్పంచ్ నారాయణనాయక్‌తో పాటు గ్రామప్రజలు చెబుతున్నారు. 2004 నుంచి ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఇప్పుడు ఉన్నట్టుండి మీటర్లు బిగించుకోలేదన్న సాకుతో విద్యుత్ సరఫరా నిలిపేశారని వాపోతున్నారు. ఇప్పటి వరకూ తమకు ఆ విషయమే అధికారులు చెప్పలేదని వెల్లడించారు. ఉన్నట్టుండి విద్యుత్ మీటర్లు బిగించుకోవాలంటే కూలినాలి చేసుకునే గిరిజనులు ఎలా డబ్బు కడతారని ప్రశ్నించారు. కనీసం రెండు రోజులు గడువు ఇవ్వాలన్నా అధికారులు వినిపించుకోకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ తండాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ రూరల్ ఏఈ శ్రీనివాసులు నాయక్ వివరణ కోరగా... తండాల్లో ఎవరూ విద్యుత్ కనెక్షన్ తీసుకోలేదని, అందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరఫరా నిలిపేశామన్నారు. ఉచిత విద్యుత్‌కు అర్హులైనప్పటికీ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు. మీటర్ ఉండి కరెంటు వాడుకుంటే సబ్సిడీ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.
కరెంటు సరఫరా నిలివేసిన
చంద్రబాబు సర్కార్
పండగ వేళ అంధకారంలో
గిరిజనులు
కనీసం రెండు రోజులు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోని విద్యుత్ అధికారులు


