రెవెన్యూ ‘కుదేలు’
అనంతపురం అర్బన్: తహసీల్దార్ల కొరతతో రెవెన్యూ శాఖ కుదేలవుతోంది. మండల స్థాయిలో రెవెన్యూ శాఖ కీలకభూమిక పోషిస్తుంది. అయితే చాలా మండలాల్లో తహసీల్దార్లు లేక ఇన్‌చార్జ్‌లతో పాలన నెట్టుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో ఏకంగా 27 చోట్ల ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. అనంతపురం జిల్లాలో ఎనిమిది మండలాల్లో, శ్రీసత్యసాయి జిల్లాలో 19 మండలాల్లో తహసీల్దార్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా అనంతపురం, పెనుకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పరిపాలనాధికారి (ఏఓ) స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
మంత్రుల నియోజకవర్గాల్లో...
రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. అదే విధంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోకవర్గం పరిధిలోని పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లోనూ ఇన్‌చార్జ్‌ల పాలన నడుస్తోంది పెనుకొండ ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి స్థానం కూడా ఖాళీగా ఉంది.
అడహాక్ పదోన్నతులకు బ్రేక్..
పరిపాలనా సౌలభ్యం కోసం తహసీల్దార్లుగా పదోన్నతి జాబితాలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు అడహాక్ పదోన్నతి కల్పించడం సర్వసాధారణం. గతంలో ఇలా డీటీలకు అడహాక్ పదోన్నతి కల్పించి మండలాలకు పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్లకు అడహాక్ పదోన్నతి కల్పించే అంశానికి ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ ఆదేశాలివ్వడంతో కలెక్టర్ల చేతులు కట్టేసినట్లయ్యింది.
ఇన్‌చార్జ్‌ల రూటే సప‘రేటు’..
ఇన్‌చార్జ్ తహసీల్దార్ పాలన సాగుతున్న మండలాల్లో కొన్నిచోట్ల అక్కడి ఇన్‌చార్జ్‌లు మా రూటే సప‘రేటు’ అంటూ తమదైన శైలిలో పాలన సాగిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. ఇలాంటి చోట కాసులు కొడితే కానీ పనులు జరగని పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మండలాల్లో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్కడి ఇన్‌చార్జ్‌లు, సిబ్బందిపై కలెక్టర్‌కు పలు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది.
ఉమ్మడి జిల్లాలో 27 మండలాల్లో
ఇన్‌చార్జ్‌ల పాలన
డివిజన్ కేంద్రాల్లో
రెండు ఏఓ స్థానాలూ ఖాళీనే
అడహాక్ పదోన్నతుల కల్పనకు
సర్కారు బ్రేక్
తహసీల్దార్లు లేరిక్కడ
అనంతపురం జిల్లా: కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు, నార్పల, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు, అనంతపురం అర్బన్ తహసీల్దార్లతో పాటు అనంతపురం ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఇక ఉరవకొండ, రాయదుర్గం తహసీల్దార్లు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. వీరికి పోస్టింగ్ వస్తే ఈ రెండు చోట్ల ఖాళీ ఏర్పడుతుంది.
శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానపల్లి, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, ఓడీ చెరువు, పెనుకొండ, సోమందేపల్లి, ఎన్‌పీకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తలుపుల, మడకశిర, అమరాపురం, రొళ్ల, అగళి తహసీల్దార్లతో పాటు పెనుకొండ ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి పోస్టు ఖాళీగా ఉంది.


