మందులు కొనుగోలు చేయాల్సిందే
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరతతో పాటు మందుల కొరత పట్టిపీడిస్తోంది. దీంతో రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 17 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 13 మంది మాత్రమే ఉన్నారు. ఎక్స్‌రే రూమ్‌లో సిబ్బంది లేరు. ఉన్న ఒక్క రేడియోగ్రాఫర్ ఇటీవలే పదవీ విరమణ పొందడంతో ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. డార్క్ రూమ్ అసిస్టెంట్లు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు స్టాఫ్ నర్సు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అకౌంటెంట్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. చివరికి మందులు సైతం అందుబాటులో లేవు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇవ్వడం లేదు. ఐరన్ సిరప్, సర్జికల్ గ్లౌజ్‌లు, యాంటిబయాటిక్ టాబ్లెట్లు తదితర 20 రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులకు ప్రైవేటుగా కొనుగోలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.


