ప్రాణం మీదకు తెచ్చిన హెడ్‌ఫోన్
గుత్తి: హెడ్‌ఫోన్ పెట్టుకుని పాటలు వినాలనే మోజు.. చివరకు ప్రాణం మీదకు తెచ్చింది. వివరాలు... గుత్తి మండలం బాచుపల్లి గ్రామానికి చెందిన యువకుడు సూర్య శనివారం రాత్రి హెడ్‌ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని లచ్చానుపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే హెడ్‌ఫోన్ పెట్టుకోవడంతో అప్పటికే పట్టాలపై వేగంగా దూసుకువస్తున్న రైలును గమనించలేకపోయాడు. చివరిక్షణంలో అప్రమత్తమయ్యేలోపు రైలు ఢీకొనడంతో ఎగిరి పట్టాల అవతల పడ్డాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో గాలింపు చేపట్టారు. పట్టాల పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న సూర్యను గమనించి వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి
పెనుకొండ: అతిగా మద్యం సేవించిన ఓ వ్యక్తి డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండలో నివాసముంటున్న రాము (49) చిన్నాచితక పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతిగా మద్యం సేవించిన ఆయన దర్గాసర్కిల్ సమీపంలోని డ్రెయినేజీలో పడ్డాడు. పైకి రాలేక డ్రెయినేజీలోనే కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. ఆదివారం ఉదయం సమీప ప్రాంత ప్రజలు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన నవీన్ (31), జయశ్రీ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఓబుళాపురంలోనే నివాసముంటూ కళ్యాణదుర్గంలో డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కళ్యాణదుర్గంలోని తన వ్యాపార కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమైన నవీన్.. బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. బాత్రూమ్ నుంచి గట్టిగా శబ్ధం రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే తలుపు బలవంతంగా తీసి పరిశీలించారు. విద్యుత్ ప్రసరిస్తుండడంతో సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేయించి క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నవీన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
‘శ్రీనివాసా’..
ఇదెక్కడి కర్రపెత్తనం!
● పరీక్ష కేంద్రంలో విద్యార్థులను
కర్రతో కొడుతున్న వైనం
● కేంద్రం చీఫ్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం
ఆత్మకూరు: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పదో తరగతి విద్యార్థులను ఆ కేంద్రం చీఫ్ కర్రతో చితకబాదుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి శనివారం వరకూ దాదాపు ఐదారుగురు విద్యార్థులను ఆయన చితకబాదినట్లుగా బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు... ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసప్రసాద్‌కు పరీక్ష కేంద్రం చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. సాధారణంగా పరీక్షలనగానే విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉంటారు. మార్కుల ఒత్తిళ్ల నేపథ్యంలో పోటీని తాళలేక పలువురు విద్యార్థులు ఇప్పటికే బలవంతంగా తనువు చాలించిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిస్తూ పరీక్షలపై ఉన్న భయాన్ని పొగొట్టాల్సిన ప్రధానోపాధ్యాయుడు గాడి తప్పి ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. శనివారం పరీక్ష రాస్తున్న స్థానిక కేజీబీవీ విద్యార్థినిని అకారణంగా కర్రతో కొట్టడంతో ఆమె చెయ్యి పూర్తిగా వాచిపోయింది. ఆదివారం చికిత్స కోసం స్థానిక పీహెచ్‌సీకి చేరుకున్న బాధితురాలు తాను పరీక్ష రాసేందుకు వెళ్లనంటూ ఏడుస్తూ కనిపించింది. తల్లిదండ్రులు, కేజీబీవీ ఉపాధ్యాయులు నచ్చచెప్పడంతో అప్పటికి సర్దుకుపోయింది. వారం రోజుల క్రితం కూడా కురుగుంటకు చెందిన విద్యార్థినిని హెచ్‌ఎమ్ కొట్టినట్లుగా సమాచారం. పరీక్ష రాసే విద్యార్థులు తప్పు చేస్తే దండించాలి కానీ, చేతులు వాచేలా కర్రతో కొట్టడాన్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రాణం మీదకు తెచ్చిన హెడ్‌ఫోన్


