కరెంట్ షాక్‌తో రైతు మృతి
తాడిపత్రి రూరల్: కరెంట్ షాక్‌కు గురై రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బ్రహ్మణపల్లిలో విషాదం నింపింది. అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి (52), ఉమా మహేశ్వరి దంపతులు. రామసుబ్బారెడ్డి తన నాలుగెకరాల పొలంలో చీనీ, అరటి సాగు చేశాడు. అరటి పంటకు నీళ్లు పెట్టేందుకు శనివారం ఉదయం తోటకు వెళ్లాడు. స్టార్టర్ పనిచేయకపోవడంతో ఫ్యూజ్ వేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే కరెంట్ షాక్‌కు గురై పడిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు రామసుబ్బారెడ్డి మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ఏడాది కుమారుల మృతి..
రామసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు శేఖర్, శివానందరెడ్డి సంతానం కాగా, గతేడాది జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఉగాది పండుగను పురస్కరించుకొని గుత్తి సమీపంలోని బాట సుంకులమ్మ ఆలయంలో మొక్కు తీర్చుకుని బైకులో తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో కారు ఢీకొనడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే సారి ఇద్దరు కుమారులు దూరం కావడంతో రామసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరి కుంగిపోయారు. బాధ నుంచి కోలుకుంటున్న సమయంలోనే కరెంట్ షాక్‌తో భర్త మృతి చెందడంతో ఉమామహేశ్వరి వేదన వర్ణనాతీతంగా మారింది. భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.


