ష్.. గప్‌చుప్!
● నంబూరి వైన్స్‌కు నిప్పు పెట్టిన ఘటనలో
నిందితుల అరెస్ట్
● గుట్టుగా రిమాండ్‌కు తరలింపు
● పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి అనంత పురం జిల్లాలోనే సంచలనం సృష్టించిన ఓ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. చిన్నచిన్న కేసులపై సైతం మీడియా సమావేశాలు నిర్వహించి చాకచక్యంగా కేసు ఛేదించామని ప్రకటించుకునే పోలీసులు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుల అరెస్ట్‌ను మాత్రం ఎవరికీ తెలియకుండా అలా ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు ప్రారంభం నుంచి కూడా మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాల్గో పట్టణ సీఐ జగదీష్ జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్న చిన్న ప్రెస్‌మీట్‌లకు కూడా హాజరయ్యే డీఎస్పీ శ్రీనివాసరావు కూడా ఎక్కడా జోక్యం చేసుకోలేదు. శనివారం నిందితుల వివరాలను ఒక ప్రకటన ద్వారా సీఐ జగదీష్ వెల్లడించారు. లక్ష్మీనగర్‌కు చెందిన మోహన్‌కుమార్, అతని సోదరుడు అఖిల్‌కుమార్, కళావతి కొట్టాలకు చెందిన బాబా ఫకృద్దీన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరచగా నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు వివరించారు. అంతకుమించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, కుదరదని చెప్పడంతో మద్యం దుకాణానికి నిప్పు పెట్టించాడని ఇటీవల బాధితుడే బహిరంగంగా చెప్పడంతో పాటు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుని ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయకపోగా చర్యలు కూడా తీసుకోలేదు. బాధితుడు శనివారం ఎస్పీ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తానని ప్రకటించడంతో పోలీసు అధికారులు జాగ్రత్త పడినట్లు తెలిసింది.


